బాలయ్య స్పాంటేనిటీ అదుర్స్ గురూ…!

నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నారని చెప్పాలి. బాలయ్య నటించిన సినిమాలన్నీ వరుసబెట్టి హిట్ల మీద హిట్లు కొడుతున్నాయి. అంతేకాకుండా 50 ఏళ్లుగా సినిమా రంగంలో విశేష సేవలందించినందుకు గాను ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది.

దీంతో బాలయ్యతో పాటుగా బాలయ్య ఫ్యాన్స్ ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. ఎంత సంతోషంలో మునిగిపోయినా… బాలయ్యలోని స్పాంటేనిటీ మాత్రం నిత్యం ఆన్ లోనే ఉంటుందని ఆదివారం మరోమారు రుజుకు అయ్యింది.

పద్మ భూషణ్ దక్కిన వేళ… బాలయ్యను అభినందించేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం నేరుగా బాలయ్య ఇంటికే వెళ్లారు. ఈ సందర్భంగా బాలయ్యను ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి.. పద్మ భూషణ్ పురస్కారానికి మీరు నిజమైన అర్హులు అంటూ కీర్తించారు.

ఇక తనను అభినందించేందుకు ఏకంగా కేంద్ర మంత్రి వచ్చిన నేపథ్యంలో బాలయ్య కూడా కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. తన వంతుగా కేంద్రానికి ధన్యవాాదాలు తెలిపేలా కిషన్ రెడ్డికి ఆత్మీయ సత్కారం చేశారు.

అనంతరం ఇద్దరూ కలిసి ఇంటి బయటకు వచ్చిన క్రమంలో అక్కడే ఉన్న మీడియాతో బాలయ్య కాసేపు ముచ్చటించారు. ఈ పందర్భంగా తన తండ్రి, దివంగత నందమూరి తారకరామారావుకు భారత రత్న అవార్డు ఇవ్వాలన్న డిమాండ్ ను బాలయ్య ప్రస్తావించారు.

కిషన్ రెడ్డి సమక్షంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించిన బాలయ్య… ఇదేదో తన ఒక్కడిదో, తన అబిమానుల డిమాండో కాదని చెప్పారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలన్నది ప్రతి తెలుగోడి కోరిక అని చెప్పారు. త్వరలోనే వారందరి కోరిక తీరుతుందని ఆశిస్తున్నా అంటూ బాలయ్య అన్నారు.

ఇలా బాలయ్య.. ఎన్టీఆర్ కు భారత రత్న గురించి మాట్లాడుతున్నంత సేపు కిషన్ రెడ్డి ఏదో తన్మయత్వంలో ఉన్నట్లుగా కనిపించారు. బాలయ్య నోట నుంచి వచ్చిన ప్రతి మాటకూ సరేనన్నట్లుగా తల ఊపుతూ సాగిన కిషన్ రెడ్డి… తన మోముపై చిరునవ్వును చెరగనీయలేదు. కిషన్ రెడ్డిలోని ఈ తన్మయత్వాన్ని చూస్తుంటే… ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని ఆయన కూడా బలంగానే కోరుకుంటున్నట్లుగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.