తెలుగోళ్లు ట్రెండ్ సెట్టర్స్: చంద్రబాబు

ఏపీలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సదస్సులో చంద్రబాబుతోపాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాము ఏపీతో కాదు చైనాతో పోటీపడుతున్నామని, ఏపీకి హైదరాబాద్ వంటి నగరం లేదని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. తాజాగా ఆ కామెంట్లపై సీఎం చంద్రబాబు స్పందించారు.

తెలుగు ప్రజలు, కమ్యూనిటీ కోసం హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని, అది తెలుగువారందరిదీ అని, కొందరిది కాదని చెప్పారు. తెలుగు జాతి కోసమే హైదరాబాద్ ను క్రియేట్ చేశామని, అలా కాదు, అది కొందరి కోసం అని ఎవరైనా అనుకుంటున్నారేమో తనకు తెలీదని చెప్పారు. హైదరాబాద్ సొసైటీ కోసం అని అందరూ అనుకుంటున్నారని అన్నారు. తెలుగు జాతి పట్ల గర్విస్తున్నామని, మరో జన్మంటూ ఉంటే తెలుగువాడిగా పుట్టాలని కోరుకుంటున్నానని తాను చాలాసార్లు చెప్పానని తెలిపారు.

తెలుగు వారంతా ప్రో యాక్టివ్ గా ఉంటారని, అందుకే ప్రపంచమంతా నంబర్ వన్ గా తెలుగువారు తయారయ్యారని తెలిపారు. తెలుగు పీపుల్ ట్రెండ్ సెట్టర్స్ అని, అందులో తన పాత్ర కూడా కొంత ఉందని చెప్పారు. తెలుగు వారి ఆత్మగౌరవం అని అన్నగారు పిలుపునిచ్చారని, తెలుగు వారి ఆత్మ విశ్వాసం అని తాను చెప్పానని అన్నారు. ఐటీ టెక్నాలజీని తెలుగు ప్రజల చేతుల్లో పెట్టానని, ఈ రోజు ప్రపంచమంతా తెలుగు వారు అన్ని రంగాల్లో రాణిస్తున్నందుకు గర్వంగా ఉందని చెప్పారు.