వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు గుప్పించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పిన వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఏకంగా తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకున్న తర్వాత… ఈ ఉదంతంపై స్పందించిన సందర్భంగా ఆమె జగన్ ను టార్గెట్ గా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ ఓ నాయకుడిగా విశ్వసనీయత కోల్పోయారని ఆమె అన్నారు. ఈ కారణంగానే జగన్ కు అత్యంత సన్నిహితుడిగా కొనసాగిన సాయిరెడ్ది పార్టీని వీడటంతో పాటుగా ఏకంగా రాజకీయాలనే వదలుకున్నారని తెలిపారు. ఈ పరిణామాన్ని వైసీపీ శ్రేణులు కాస్తంత లోతుగా ఆలోచన చేయాలని ఆమె కోరారు.
జగన్, సాయిరెడ్డిల మధ్య ఉన్న సంబంధాలను తనదైన శైలిలో బయటపెట్టిన షర్మిల… జగన్ ఏది చెబితే అది చేయడంలో సాయిరెడ్డి ముందు ఉంటారని ఆమె అన్నారు. జగన్ అబద్ధం చెప్పమంటే… సాయిరెడ్డి ఎంతమాత్రం ఆలోచించకుండా అబద్ధాలు చెబుతారని ఆరోపించారు. ఈ క్రమంలోనే రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా తన బిడ్డల విషయంలోనే సాయిరెడ్డి అబద్ధాలనే వల్లె వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ ఎవరిని తిట్టమంటే.. వారిని తిట్టడమే సాయిరెడ్డి పని అని కూడా ఆమె ఆరోపించారు. వైఎస్ వివేూకానందరెడ్డి విషయంలో ఇప్పటికైనా సాయిరెడ్డి నిజం ఒప్పుకున్నారని ఆమె అన్నారు. మిగిలిన విషయాల్లోనూ సాయిరెడ్డి నోరు విప్పి నిజాలు బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. తాను చెప్పినవన్నీ అబద్ధాలేనని సాయిరెడ్డికీ తెలుసునన్న షర్మిల… జగన్ నైజం తెలుసుకున్న తర్వాత అయినా సాయిరెడ్డిలో మార్పు రావాలని, తాను చెప్పిన అబద్ధాలను తానే ఒప్పుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇక బీజేపీతో జగన్ అంటకాగారంటూ షర్మిల సంచలన ఆరోపణలు గుప్పించారు. తనను తాను కాపాడుకునేందుకు సాయిరెడ్డిని జగన్ బీజేపీకి దగ్గర చేశారని ఆమె ఆరోపించారు. జగన్ బీజేపీకి దత్తపుత్రుడేనని ఆమె ఘాటు వ్యాఖ్య చేశారు. ఇన్నాళ్లు సాయిరెడ్డిని అడ్డం పెట్టుకుని బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు.
నాయకుడిగా ప్రజలను, నేతగా తనను నమ్ముకున్న వాళ్లను మోసం చేసిన జగన్… తనను తాను మాత్రం కాపాడుకునేందుకు బీజేపీతో దోస్తీ చేశారన్నారు. ఇందుకు సాయిరెడ్డిని జగన్ ఓ ఆయుదంగా వాడుకున్నారని ఆమె ఆరోపించారు. విశ్వసనీయతను కోల్పోయిన జగన్ తీరును వైఎస్ అభిమానులు గుర్తించాలని ఆమె కోరారు. జగన్ ఏది చెబితే అది చేసిన సాయిరెడ్డే ఆయనను వదిలివెళ్లారంటే పరిస్థితి ఏమిటన్న దానిపై వారంతా ఆలోచన చేయాలని షర్మిల కోరారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates