తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో బాంబు పేలుస్తారో తెలియని విధంగా అమెరికా అధినేత నిర్ణయాలు ఉంటాయన్నది తెలిసిందే. నిమిషానికోరకంగా.. నిర్ణయాలు మార్చే ఏకైక అమెరికా అధ్యక్షుడిగా కూడా ట్రంప్ చరిత్ర సృష్టించారు. రెండోసారి అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు.
ముఖ్యంగా తన మాట వినని దేశాలపై ఆయన సుంకాలతో విరుచుకుపడ్డారు. చైనా, భారత్ సహా.. అనేక దేశాలపై ఆయన తన తెంపరితనాన్ని చూపించారు. సుంకాల రూపంలో 25 శాతం.. 50 శాతం.. 100, 200 శాతం అంటూ.. దేశాలను హడలెత్తించారు. ట్రంప్ వైఖరితో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు కూడా అనిశ్చితికి చేరాయి. బంగారం, వెండి ధరలు ఠారెత్తుతున్నాయి. బులియన్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. పోనీ.. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికా ప్రజలు ఏమైనా సంతోషంగా ఉన్నారా? అంటే.. అదీ లేదు.
అమెరికాలో నిరుద్యోగం తాండవిస్తోంది. ఐటీ పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. ఇలా.. ప్రపంచ దేశాలను తన నిర్ణయంతో ఇరుకున పెట్టిన ట్రంప్‌కు సొంత దేశంలోనే భారీ షాక్ తగిలింది. ట్రంప్ విదించిన సుంకాలను సుప్రీంకోర్టు నిర్ద్వంద్వంగా కొట్టివేసింది. అంతేకాదు.. ఇప్పటి వరకు ఆయా దేశాల నుంచి అదనంగా సేకరించిన సుంకాలను తక్షణమే వెనక్కి ఇచ్చేయాలని కూడా ఆదేశించింది. ఈ పరిణామంతో అమెరికా స్టాక్ మార్కెట్లు క్షణాల వ్యవధిలోనే లాభాల బాటపట్టాయి.
అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం-1977 ప్రకారం ట్రంప్ తీసుకున్న సుంకాల నిర్ణయాలు చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తేల్చిచెప్పారు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ సంచలన తీర్పును వెలువరించారు. సుంకాలతో సహా పన్నులు విధించే అధికారాన్ని రాజ్యాంగం యూఎస్ కాంగ్రెస్ కు మాత్రమే ఉందని.. న్యాయ మూర్తులు అభిప్రాయపడ్డారు.
ఇకనైనా మార్పు వస్తుందా?
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ట్రంప్‌లో మార్పు వస్తుందా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. అమెరికా చట్ట సభలో ట్రంప్‌ను బలపరిచే రిపబ్లికన్‌లు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాటకు తిరుగులేదన్న వాదన ఉంది. గతంలోనే ట్రంప్ సుప్రీంకోర్టు తీర్పును ఊహించారు. తన నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా.. తాను చట్టసభల ద్వారా తన నిర్ణయాన్ని అమలు చేస్తానని.. కరాఖండీగా చెప్పారు. ఇప్పుడు.. సుప్రీంకోర్టు తీర్పునేపథ్యంలో ట్రంప్ చట్ట సభలో తన నిర్ణయాన్ని ఆమోదించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates