రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానంటూ వైసీపీ కీలక నేత వేణుంబాక విజయసాయిరెడ్డి.. తన నిష్క్రమణ పర్వంలో మిగిలి ఉన్న కార్యాన్ని కూడా శనివారం ఉదయం పూర్తి చేసేశారు. శనివారం ఉదయం ఎంచక్కా ఢిల్లీలోని తన అధికారిక నివాసం నుంచి బయలుదేరి… రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ నివాసానికి చేరుకున్నారు. అప్పటికే సిద్ధం చేసుకున్న తన రాజీనామా పత్రాన్ని ఆయన ధన్ కడ్ చేతిలో పెట్టేశారు. స్పీకర్ ఫార్మాట్ లోనే సాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సాయిరెడ్డి అందజేసిన రాజీనామా పత్రాన్ని అందుకున్న థన్ కడ్…తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదిలా ఉంటే… శనివారం ఉదయం వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి ఢిల్లీలోని సాయిరెడ్డి నివాసానికి వెళ్లారు. సాయిరెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం ఆయన బయటకు రాగా… అక్కడే వేచి చూస్తున్న మీడియాతో ఆయన పొడిపొడిగానే మాట్లాడారు. రాజకీయ సన్యాసం విషయంపై పునరాలోచన చేయాలని తాను సాయిరెడ్డిని కోరానని ఆయన తెలిపారు. తన ప్రతిపాదనకు సాయిరెడ్డి సానుకూలంగానే స్పందించినట్లుగా తాను భావిస్తున్నానని తెలిపారు. అయితే సాయిరెడ్డి నిర్ణయం వెనుక ఉన్న కారణాలు తనకేమీ తెలియవని గురుమూర్తి తెలిపారు.
తన ఇంటికి వచ్చిన గురుమూర్తితో భేటీ అనంతరం ఆయనతో పాటే తన ఇంటి నుంచి సాయిరెడ్డి బయటకు వచ్చారు. గురుమూర్తిని అలా పంపించేసి… సాయిరెడ్డి తన కారులో ఎక్కి నేరుగా ఉపరాష్ట్రపతి భవన్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా గురుమూర్తి మీడియాతో మాట్లాడుతుండగానే… సాయిరెడ్డి కారు బయలుదేరింది. దీంతో గురుమూర్తి కూడా వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోగా.. సాయిరెడ్డి తన కారును ముందుకు కదిలించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయన స్పందన కోసం యత్నించగా… వారికి సైగలు చేస్తూ ఏమీ మాట్లాడకుండానే సాయిరెడ్డి సాగిపోయారు.