చేయాల్సినంత డ్యామేజ్ చేసేసి పక్కకు తప్పుకున్న సాయి రెడ్డి

గడిచిన రెండు దశాబ్దాల్లో తెలుగు రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన రాజకీయ నాయకుడు ఎవరన్న ప్రశ్నను అడిగితే.. ఏ ఒక్కరు కూడా విజయసాయిరెడ్డి పేరు చెప్పరు. ఒకవేళ.. ఎవరైనా చెబితే.. ఆశ్చర్యాన్ని ప్రదర్శిస్తారు? విజయసాయి ఎందుకు అవుతారు? అని ప్రశ్నిస్తారు.కానీ.. తరచి చూస్తే.. విజయసాయికి మించి తెలుగు రాజకీయాల్ని మాత్రమే కాదు.. తెలుగు ప్రజల్ని సైతం తీవ్రంగా ప్రభావితం చేశారని చెప్పాలి.

ఇవాల్టి రోజున సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయటం.. తమకు నచ్చిన రాజకీయ నాయకుడ్ని వ్యక్తిత్వ హననానికి పాల్పడటం.. వెనుకా ముందు చూసుకోకుండా కామెంట్లు చేయటం.. చదవలేనంత దారుణ భాషను వాడటం లాంటి వికారాలకు తెర తీసిన తొలి నాయకుడిగా విజయసాయిని చెప్పాలి. సోషల్ మీడియాను అసరా చేసుకొని రాజకీయాలు.. రాజకీయ వ్యాఖ్యలు చేసే తొలితరంలో ప్రత్యర్థులపై దారుణమైన భాషతో ఇష్టారాజ్యంగా విరుచుకుపడేలా అలవాటు చేసిన ఘనత విజయసాయిరెడ్డిదే.

రాజకీయంగా విభేదిస్తే.. రాజకీయంగా సమాధానం చెప్పొచ్చు. అందుకు భిన్నంగా రాజకీయంగా ప్రత్యర్థి అయితే చాలు.. అది ఇది అన్న తేడా లేకుండా ఇష్టారాజ్యంగా కామెంట్లు చేయటం.. ఈ క్రమంలో క్యారెక్టర్ ఎసాసినేషన్ కు వెనుకాడని నేతగా విజయసాయిని చెప్పాలి.ఒక టీంను పెట్టుకొని..ప్రత్యర్థులపై ఇష్టారాజ్యంగా భాషను వాడేయటం.. అదేమంటే..ఆ మాత్రం మసాలా సోషల్ మీడియాలో ఉండాలని.. లేకుంటే చప్పగా.. ఎలాంటి కిక్ ఉండదన్నట్లుగా వ్యవహరించేవారు.

విజయసాయి ట్వీట్ల స్ఫూర్తితో.. అడ్డదిడ్డమైన వ్యాఖ్యలు చేసే జోరు ఎక్కువైంది. సోషల్ మీడియా తరంలో ఈ తరహా కల్చర్ ఏ మాత్రం మంచిది కాదన్న విషయాన్ని ఆయన అస్సలు పట్టించుకోలేదు. సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకొని ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు మాత్రమే కాదు.. వీడియోల్ని క్రియేట్ చేసి జనాల మీదకు వదిలే కార్యక్రమానికి విజయసాయి ఆద్యుడనే చెప్పాలి.

అలాంటి ఆయన.. తెలుగు రాజకీయాలకు చేయాల్సినంత డ్యామేజ్ చేసేసి.. ఈ రోజున రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించి.. తాను తెలుగుదేశం పార్టీతో రాజకీయంగా మాత్రమే విభేదించానని.. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని చెప్పటం దేనికి నిదర్శనం? అంతేనా.. పవన్ ను ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయటమే కాదు.. ప్యాకేజీ స్టార్ లాంటి పదాల్ని విచ్చలవిడిగా తన సోషల్ మీడియా ఖాతాల్లో వాడేసిన విజయసాయి ఈ రోజున పవన్ కల్యాణ్ తో చిరకాల స్నేహం ఉందని ట్వీట్ చేయటం దేనికి నిదర్శనం? ప్రపంచంలోని ఏ రాజకీయ నాయకుడైనా సరే.. తన చిరకాల స్నేహితుడ్ని ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో తిట్టేయటం చేస్తారా? ఒకవేళ అలా చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. విజయసాయి మొదటిస్థానంలో ఉంటారు. అలాంటి విజయసాయి..ఈ రోజున చేస్తున్న వ్యాఖ్యలు అందరూ మాట్లాడుకునేలా చేశారని చెప్పాలి.