వైసీపీలోనే కాకుండా దాదాపుగా తెలుగు నేలకు చెందిన అన్ని రాజకీయ పార్టీల్లో ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసంపైనే చర్చ సాగుతోంది. ఉరుము లేని పిడుగులా అలా సోషల్ మీడియాలోకి వచ్చేసి.. తన రాజకీయ నిష్క్రమణను ప్రకటించిన సాయిరెడ్డి అందరినీ షాక్ కు గురి చేశారు. శనివారం తన రాజ్యసభ సదవికి రాజీనామా చేస్తానని సాయిరెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఢిల్లీలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ రంగాన్ని వీడుతున్నానని, ఇకపై వ్యవసాయం చేసుకుంటానని ఆయన చేసిన ప్రకటనపై భిన్న రకాల ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం జగన్ విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. సరిగ్గా పార్టీ అధినేత అందుబాటులో లేని సమయాన్ని చూసి సాయిరెడ్డి ఈ ప్రకటన చేయడం వ్యూహాత్మకమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే సాయిరెడ్డి లాంటి నేత నుంచి ఇలాంటి ప్రకటన వచ్చిందంటే… ఆ సమాచారం క్షణాల్లో జగన్ కు చేరిపోయి ఉంటుంది కదా. ఆ వెంటనే పరిస్థితిని సమీక్షించిన జగన్.. సాయిరెడ్డి వద్దకు తన రాయబారిని పంపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. జగన్ ఆదేశాలతో మరో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ రంగంలోకి దిగిపోయారు.
సాయిరెడ్డి రాజకీయ సన్యాసంపై కాకినాడలో స్పందించిన పిల్లి… ఒత్తిడుల కారణంగానే సాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయపడ్డారు. వ్యాపారాలు ఉన్న నేతలకు ఒత్తిడులు సహజం అని కూడా ఆయన అన్నారు. తాను రేపు (శనివారం) ఢిల్లీ వెళుతున్నట్లుగా పిల్లి తెలిపారు. గణతంత్ర వేడుకలు, ఇతరత్రా అభివృద్ధి పనుల నిమిత్తమే తాను ఢిల్లీ వెళుతున్నానని కూడా ఆయన మీడియా ప్రతినిధులు అడక్కుండానే చెప్పేశారు. ఈ లెక్కన ఆయన జగన్ ఆదేశాలతో సాయిరెడ్డితో చర్చలు జరిపేందుకే ఢిల్లీ వెళుతున్నట్లుగా స్పష్టమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పిల్లి సుభాష్.. జగన్ ఫ్యామిలీకి నమ్మిన బంటు. అంతేకాకుండా సీనియారిటీ నేపథ్యంలో ఆయన మాటకు పార్టీలో దాదాపుగా అందరు నేతలూ గౌరవం ఇస్తారు. ఈ కారణంగానే పిల్లిని తన రాయబారిగా జగన్ ఎంచుకున్నట్లు సమాచారం. రాయబారి ఎవరన్న దానిని పక్కనపెడితే… రాజకీయ సన్యాసంపై కీలక ప్రకటన చేసిన తర్వాత సాయిరెడ్డి వెనక్కు తగ్గుతారా? అన్నది ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నగా మారింది. రాజకీయాల్లోకి రాకముందు ఆడిటర్ గా పనిచేసిన సాయిరెడ్డి… ఓ సారి నిర్ణయం తీసుకున్నారంటే దానిపై పునరాలోచన చేయరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ లెక్కన జగన్ రాయబారంతో పెద్దగా ఫలితం ఉండదన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.