రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా: విజయసాయిరెడ్డి

వైసీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటులో ఆ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి శుక్రవారం సాయంత్రం సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా రాజ్యసభ సభ్యత్వానికి శనవారం రాజీనామా చేయనున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయం తన వ్యక్తిగతమైనదని కూడా సాయిరెడ్డి పేర్కొన్నారు. ఇందులో ఏ ఒక్కరి ప్రమేయం గానీ, ప్రభావం గానీ లేదని కూడా ఆయన తెలిపారు.

వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని సాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎలాంటి ఒత్తిడులు లేవని కూడా ఆయన పేర్కొన్నారు. ఇప్పుడే కాదు ఇక భవిష్యత్తులోనూ ఏ రాజకీయ పార్టీలో కూడా చేరబోనని కూడా ఆయన ప్రకటించారు. డబ్బు ఆశించో, ఎవరో ఒత్తిడి చేస్తేనో తాను ఈ నిర్ణయం తీసుకోలేదని కూడా ఆయన తెలిపారు. తనకు రాజకీయాల్లో మంచి అవకాశాలు కల్పించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానని సాయిరెడ్డి తెలిపారు.

వైసీపీలో కీలక పదవులు కట్టబెట్టిన జగన్ కు ధన్యవాదాలు తెలిపిన సాయిరెడ్డి.. జగన్ సతీమణి బారతి రెడ్డికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక జగన్ తనను రెండు సార్లు రాజ్యసభకు పంపారని, జగన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రాభివృద్ది కోసం శక్తివంచన లేకుండా కృషి చేశానని తెలిపారు. ఈ క్రమంలో కేంద్రానికి, రాష్ట్రానికి వారధిలా వ్యవహరించానన్నారు. పదేళ్ల పాటు తనకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

ఇక టీడీపీ, జనసేనలతో అనుబంధాన్ని సాయిరెడ్డి ఆసక్తికరంగా ప్రస్తావించారు. టీడీపీపై తనది రాజకీయ పరమైన పోరాటమే తప్పించి… ఆ పార్టీతో వ్యక్తిగతంగా ఎలాంటి వైరం లేదని తెలిపారు. చంద్రబాబు కుటుంబంతోనూ తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. ఇక జనసేనాని పవన్ కల్యాణ్ తో తనకు చిరకాల స్నేహం ఉందని కూడా సాయిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత వ్యవసాయం చేసుకుంటానని ఆయన మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాయిరెడ్డి చేసిన ఈ ప్రకటన తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.