వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. కేవలం 11 స్థానాలకే ఆయన పరిమితం అయ్యారు. దీంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. అయినప్పటికీ.. బాధ్యతాయుత ప్రతిపక్షంగా ఆయన శాసన సభకురావాల్సి ఉంది. ప్రజల తరఫున ప్రశ్నించాల్సి కూడా ఉంది. కానీ, ఆయన ఇప్పటి వరకు జరిగిన మూడు సమావేశాలకు డుమ్మా కొట్టారు. కేవలం తొలిసారి ప్రమాణ స్వీకారానికి వచ్చారు.
తర్వాత గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోయారు. ఇక, ఆ తర్వాత అసలు సభ వైపే తొంగి చూడలేదు. దీంతో అప్పట్లోనే జగన్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా.. ఆయన పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుపోయారు. బెంగళూరు-తాడేపల్లికే పరిమితం అయ్యారు. అప్పుడప్పుడు మీడియా సమావేశాలు నిర్వహించారు. ఇక, ఇప్పుడు త్వరలోనే బడ్జెట్ సమావేశాలకు రంగం రెడీ అవుతోంది. 2025-26 బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి రెండో వారం నుంచి మొదలయ్యే అవకాశం ఉంది.
అయితే.. ఈ సమావేశాలకు కూడా జగన్ డుమ్మా కొట్టనున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్షం పై కోర్టు నిర్ణయం వెలువడే వరకు ఆయన సభలోకి అడుగు పెట్టకూడదని నిర్ణయించుకున్నారో..ఏమో.. ఇప్పుడు కూడా అదే పంథాలో ముందుకు సాగుతున్నారు. వచ్చే ఫిబ్రవరిలో బిజీ షెడ్యూల్ పెట్టుకుని పక్కా ప్లాన్‌తో సభకు రాకుండా.. ఎగవేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని టీడీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే నెల నుంచి జగన్ జనంలోకి రానున్నారు.
సుమారు 6 మాసాల వరకు ఆయన జనంలోనే ఉంటారని తాడేపల్లి వర్గాలు తాజాగా చెప్పుకొచ్చాయి. అంతేకాదు.. ఫిబ్రవరి తొలి వారం నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలు ఆరు మాసాల వరకు జరుగుతాయని అంటున్నారు. ఈ పర్యటనల్లో ప్రజలను, పార్టీ నాయకులను కూడా జగన్ కలుసుకుంటారని.. వారి సమస్యలు వింటారని పార్టీని గాడిలో పెట్టడంతోపాటు.. ప్రజలకు ఆయన చేరువ అవుతారని కూడా చెబుతున్నారు. అంటే.. దీనిని బట్టి ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల సమయంలోనూ ఆయన సభకు వచ్చే అవకాశం కనిపించడం లేదన్న విషయం స్పష్టమవుతోంది.