బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పక్క చూపులు చూస్తున్నారా? పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. అంతర్గతంగా పార్టీలో ఈ వ్యవహారం చర్చకు వస్తోంది. రాజకీయాల్లో రంగులు మార్చడం కామన్ అయిపోయిన నేపథ్యంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో చెప్పడం కష్టం. సో.. తలసాని కూడా దీనికి అతీతుడేమీ కాదన్న వాదన ఉంది. గతంలో టీడీపీలో ఉన్న ఈయన .. తర్వాత కేసీఆర్ చెంతకు చేరారు.
సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి విజయాలు దక్కించుకుని మంత్రిగా కూడా చక్రం తిప్పారు. కొన్ని సందర్భాల్లో కుమారుడి కారణంగా వివాదం కూడా అయ్యారు. ఇక, బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత.. తలసాని పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్‌లో కనిపించడం లేదు. ఏదో అప్పుడప్పుడు మీడియా ముందుకు రావడం.. రెండు కామెంట్లు చేయడంతోనే సరిపుచ్చుతున్నారు. వాస్తవానికి కేటీఆర్‌పై ఫార్ములా ఈ రేస్ కేసులు నమోదైనప్పుడు.. కూడా తలసాని పెద్దగా రియాక్ట్ కాలేదు.
అప్పటికి ముందే ఆయన వ్యూహం మార్చుకుంటున్నారన్న చర్చసాగింది. ఇక, ఇప్పుడు మరింత ద్రుఢ పడుతోంది. ఆయన పక్క చూపులు చూస్తున్నారని.. తిరిగి పాత గూటికి చేరే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. అంటే.. ఆయన టీడీపీ చెంతకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీలో టీడీపీ అధికారంలో ఉండడం.. తెలంగాణలోనూ విస్తరించాలన్న కాంక్ష ఉన్న నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన తలసాని.. దీనిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.
పార్టీ మారితే.. ఏకంగా తెలంగాణ టీడీపీ పగ్గాలు తనకు దక్కుతాయన్న ఆశాభావం ఆయనలో కనిపిస్తోంది. ఇక, ఎవరు వచ్చినా.. పార్టీలోచేర్చుకునేందుకు.. పదవులు ఇచ్చేందుకు టీడీపీ కూడా రెడీగానే ఉంది. ఇక, ఈ వ్యవాహరంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా ఉప్పందినట్టు తెలిసింది. దీంతో ఆయన పరిణామాలను వేచి చూస్తున్నారని.. తలసాని నిర్ణయాన్ని బట్టి ఆయన డెసిషన్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తలసాని కనుక.. నిజంగానే పార్టీ మారితే ఆ ప్రభావం బీఆర్ఎస్‌పై భారీగానే పడనుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.