రేవంత్ కు ఈ టూర్ వెరీ వెరీ స్పెషల్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి తాజా విదేశీ పర్యటన నిజంగానే వెరీ వెరీ స్పెషల్ అని చెప్పక తప్పదు. రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే సీఎం సీటును దక్కించుకున్న రేవంత్.. నిత్యం ఆరోపణలు, ప్రత్యారోపణలతో సతమతమైపోతున్నారు. రాజకీయాలంటేనే ప్రత్యర్థులపై పైచేయి సాధించడమే కదా, అధికారం అందివచ్చాక… తనకంటే ముందు ఉన్నపాలకుల కంటే మెరుగైన పాలన అందించాలని ప్రతి ఒక్క పొలిటీషియన్ కోరుకుంటారు. అందుకు అనుగుణంగా ఎంత కష్టమైనా కూడా ఇష్టంగానే పని చేసుకుంటూ వెళతారు. రేవంత్ అందుకు భిన్నమేమీ కాదు. ఓ వైపు తనను విమర్శలు చుట్టుముడుతున్నా… తనదైన మార్క్ ను చూపేందుకు తపిస్తున్నారు.

రాష్ట్రానికి పెట్టుబడులు దండిగా రాబడదామంటూ దావోస్ టూర్ వెళ్లిన రేవంత్… గడచిన 4 రోజులుగా అక్కడ తనవంతు కృషి చేశారు. తన ప్రతినిధి బృందానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అనుకున్నదాని కంటే కూడా అధిక మొత్తంలో పెట్టుబడులను రాబట్టి ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ క్రమంలో సంతోషంగా తిరుగు ప్రయాణం అవుతున్న రేవంత్ కు ఓ ఊహించని పరిణామం ఎదురైంది. ఈ పరిణామం ఆయనలోని సంతోషాన్ని రెట్టింపు చేసింది. అంతేనా…రాజకీయంగా తనకు వెయ్యేనుగుల బలాన్ని ఇచ్చింది. అంతేకాదండోయ్..ఈ టూర్ ను ఆ ఘటన చిరస్మరణీయం చేసింది.

హైదరాబాద్ కు ప్రయాణమయ్యేందుకు రేవంత్ సిద్ధమవుతుండగా… స్విట్జర్లాండ్ లో ఇంటర్ చదువుతున్న తెలంగాణకు చెందిన ప్రణీత అనే బాలిక పరుగు పరుగున రేవంత్ వద్దకు వచ్చింది. మన తెలుగు బిడ్డ… అది కూడా తెలంగాణ బిడ్డ… అందులోనూ స్విస్ లో చదువుతోందని రేవంత్ ప్రణీతను ఆప్యాయంగా పలకరించారు. అక్కున చేర్చుకున్నారు. ఆ బాలిక కోరిక మేరకు ఆమె, ఆమె తండ్రితో కలిసి రేవంత్ ఫొటో కూడా దిగారు. వచ్చీ రాగానే తనను రేవంత్ ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడంతో ప్రణీత ఆనందానికి అవధులే లేకుండా పోయాయి.

అసలు కథ అంతా అప్పుడే మొదలైంది. ఇంటర్ చదువుతున్నదన్న మాటే గానీ… ప్రణీతకు మాతృభూమిపై వల్లమాలిన అభిమానం ఉంది. భాగ్య నగరి హైదరాబాద్ పై అలవిమాలిన ప్రేమా ఉంది. అందుకే కాబోలు… హైదరాబాద్ లో పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా హైడ్రా పేరిట రేవంత్ సర్కారు తీసుకుంటున్న చర్యలను ప్రణీత ఆకాశానికెత్తేసింది. అంతేకాకుండా ముక్కుపుటాలను అదరగొడుతున్న మూసీని సుందరీకరిస్తామంటున్న రేవంత్ సర్కారు నిర్ణయాన్ని ఆ బాలిక స్వాగతించింది. ఈ విషయాలను ఆ బాలిక నోట విన్న రేవంత్.. అలా మైమరచి ఆ బాలిక వైపే చూస్తూ నిలబడిపోయారట.

ఇక తన మాతృభూమికి సీఎంగా వ్యవహరిస్తున్న రేవంత్ ను కలిసేందుకు ఆ బాలిక చేసిన సాహసాన్ని తెలుసుకుని యావత్తు తెలంగాణ బృందం ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టిందట. ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో చలి పులి విజృంభిస్తోంది. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లోకి పడిపోయాయి. వెరసి అక్కడి ప్రభుత్వాలు అత్యవసర సేవలు మినహా మిగిలిన వాటిపై నిషేధం విధించింది. అయితే ప్రణీత ఉంటున్న ప్రాంతమేమో దావోస్ కు ఏకంగా 300 మైళ్ల దూరంలో ఉందట. గురువారం వెళ్లకపోతే రేవంత్ ను కలవలేనని భావించిన ప్రణీత… తండ్రిని బతిమాలాడి మరీ వణికే చలిలోనే దావోస్ కు ప్రయాణం కట్టిందట. కూతురు ముచ్చట చూసిన ఆ తండ్రి కూడా బిడ్డను తీసుకుని రేవంత్ వద్దకు తీసుకువచ్చి… రేవంత్ ను కలిసిన సంతోషం బిడ్డ ముఖంలో… తన బిడ్డను చూసిన రేవంత్ లో కనిపించిన ఆనందాన్ని చూసి తరించిపోయారట.