అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తొలి నిర్ణయం.. నాలుగు రోజులు కూడా తిరగక ముందే బుట్టదాఖలైంది. ఇది ఆయన భవిష్యత్ నిర్ణయాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. అమెరికా ఫస్ట్
నినాదంతో తన పాలన సాగిస్తానని చెప్పిన ట్రంప్.. అమెరికా సంపద అమెరికన్లకే దక్కాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయన దేశంలో గ్రీన్ కార్డు హోల్డర్లను తగ్గించేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
1863లో అమెరికా చట్ట సభలు తీసుకున్న నిర్ణయాన్ని శతాబ్దన్నర(150 ఏళ్ల తర్వాత) కాలం తర్వాత ట్రంప్ రద్దు చేశారు. వాస్తవానికి ఇది రాజ్యంగబద్ధమైన నిర్ణయం కానీ, ట్రంప్ తనకు ఉన్న విశేష అధికారాలతో రద్దు చేశారు. తద్వారా.. ఇతర దేశాలకు చెందిన దంపతులకు అమెరికాలో పుట్టే పిల్లలకు వెంటనే పౌరసత్వం సంక్రమించకుండా.. పోయింది. ఇది సంచలన నిర్ణయంగా ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇక, ఆయన మద్దతు దారులు కూడా సంబరాలు చేసుకున్నారు. తద్వారా అమెరికా పౌరసత్వం ఉన్న జనా భా తగ్గి.. స్థానికంగా ఉన్నవారికి అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.
కానీ, ఈ నిర్ణయాన్నివిపక్ష డెమొక్రాట్లు పాలిస్తున్న రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వీరే కాకుండా.. హక్కుల సంఘాలు, సామాజిక ఉద్యమకారులు(కమ్యూనిటీలు) కూడా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల హైకోర్టుల్లో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా సియాటెల్ ఫెడరల్ కోర్టు.. ఈ కేసును విచారించి.. సంచలన నిర్ణయం తీసుకుంది. నూతన అధ్యక్షుడుగా ట్రంప్ తీసుకున్న తొలి నిర్ణయాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది.
ఇక, ఇతర రాష్ట్రాలైన వాషింగ్టన్, ఇల్లినాయిస్, అరిజోనాల కోర్టులు కూడా.. ఈ కేసులను తీవ్రంగానే భావిస్తున్నాయి. వీటిపై విచారణల అనంతరం.. రద్దు దిశగానే కోర్టులు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంద న్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు తొలి నిర్ణయమే భారీ ఇబ్బందిగా మారింది. మరోవైపు.. విదేశాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రకటనలు కూడా.. ట్రంప్‌కు ఇబ్బందిగా మారనున్నాయి. పనామా కాలువ నుంచి రష్యాపై ఆంక్షల వరకు.. చైనా, మెక్సికో దిగుమతలపై సుంకాల వరకు కూడా.. ట్రంప్ వివాదం అవుతున్నారు.