స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సు(ఆర్థిక సదస్సుగా దీనికి పేరు) రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలా పోటా పోటీగా సాగుతోంది. ఈ సదస్సుకు.. దక్షిణాది రాష్ట్రాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే హాజరు కాగా.. మహారాష్ట్ర నుంచి సీఎం దేవేంద్ర ఫడణవీస్ వచ్చారు. మహారాష్ట్ర ఏకంగా 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఇది ఏపీకి పెద్దగా పోటీ కాదు. కానీ, తెలుగు రాష్ట్రాల మధ్యే పోటీ ఉంది.
ఈ విషయంలో చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఓవర్ టేక్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, ఇక్కడే తేడా కొడుతోంది. ఎందుకంటే.. తొలిసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత.. తన పేరును పార్టీ ప్రతిష్టను కూడా నిలబెట్టే విధంగా రేవంత్‌రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ముందుకుసాగుతున్నారు. గత ఏడాది కూడా 4 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు దక్కించుకున్నారు. ఈ సారి 5 లక్షల కోట్ల రూపాయల వరకు టార్గట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కన్నా వేగంగా రేవంత్‌రెడ్డి బృందం పెట్టుబడులు సాధిస్తోంది. గురువారం నాటికి మూడు రోజుల పాటు ముగిసిన సదస్సులో ఏపీ కేవలం 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే సాధించింది. ఇతర సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఆహ్వానాలు ఇస్తోంది. కానీ, రేవంత్ రెడ్డి బృందం మాత్రం 56 వేల కోట్ల రూపాయల పైచిలుకు పెట్టుబడులు దక్కించుకుంది. ప్రధానంగా సన్ పెట్రో కెమికల్స్ నుంచే 45 వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఉండడం గమనార్హం.
వాస్తవానికి.. సన్ పెట్రో కెమికల్స్ సంస్థను చంద్రబాబు తుది జాబితాలో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పైగా ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఐటీ పెట్టుబడులపైనే చంద్రబాబు దృష్టి పెట్టారు. కానీ, తెలంగాణ సర్కారు మాత్రం పారిశ్రామిక రంగ పెట్టుబడులపై ఎక్కువగా దృష్టి పెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ.. ఐటీ పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో వాటికి పోటీ ఎక్కువగా ఉంది. కానీ, పారిశ్రామిక రంగాల విషయంలో పోటీ తక్కువగా ఉండడంతో ఈ అవకాశాన్ని రేవంత్ రెడ్డి బృందం సద్వినియోగం చేసుకోవడంతో 45 వేల కోట్ల రూపాయలు ఇందులోనే పెట్టుబడులుగా రానున్నాయి.