ఏపీ విపక్ష పార్టీగా ఉన్న వైసీపీలో జోష్ కనిపించడం లేదు. జగన్ రావాలి.. తమ పార్టీ ముందుకు సాగాలి అన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజల్లో వైసీపీ టాక్ ఎక్కడా వినిపించడం లేదు. దీనికి తోడు.. ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయని గ్రహించిన మరుక్షణమే.. కూటమి పార్టీలే స్పందిస్తున్నాయి. ప్రతి పక్షం చేసే విమర్శలను కూటమి పార్టీలే చేస్తున్నాయి. దీంతో వైసీపీకి ఛాన్స్ చిక్కడం లేదన్న వాదన వినిపిస్తోంది. దీంతో వైసీపీ తరఫున వాయిస్ కు బలం లేకుండా పోయింది.
తిరుపతి తొక్కిసలాట ఘటన విషయంలో వైసీపీ దూకుడుగా ముందుకు సాగాలని భావించింది. అందుకే వెంటనే వైసీపీ అధినేత జగన్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. కానీ, ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ తీవ్రస్థాయిలో స్పందించారు. దీనిని వదిలి పెట్టకుండా.. రెండు మూడు రోజుల పాటు కొనసాగించారు. ఫలితంగా వైసీపీ ఏదో చేయాలని అనుకున్నా.. వెనుకబడి పోయింది. ఈ ప్రభావంతో పార్టీ నాయకులు కూడా డీలా పడాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక, ప్రపంచ పెట్టుబడుల సదస్సు విషయంలో టీడీపీ దూకుడుగా ఉంది. అనేక సంస్థలతో పెట్టుబడు లపై చర్చలు సాగిస్తోంది. అయితే.. దీనిపైనా వైసీపీ మౌనంగా ఉంది. ఎలాంటి కామెంట్లు చేయడం లేదు. నిజానికి ఇప్పటి వరకు జరిగిన మూడు రోజుల సదస్సులో ఏపీకి 10 వేల కోట్ల వరకు మాత్రమే పెట్టుబడులు వచ్చాయి. రెండు సంస్థలు మాత్రమే ఒప్పందాలు చేసుకున్నాయి. దీనిని కార్నర్ చేస్తారని ప్రభుత్వం తరఫున నాయకులు భావించినా.. వైసీపీ ఆ చాన్స్ తీసుకోలేదు.
ఇక, ధాన్యం కొనుగోలు విషయంలో క్రెడిట్ కొట్టేసిన జనసేన తర్వాత వెనుకబడింది. ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాలు .. ప్రభుత్వ అను కూల మీడియాలోనే ఎక్కువగా వచ్చాయి. అయితే.. వైసీపీ మాత్రం దీనిని తనకు అనుకూలంగా మార్చు కునే ప్రయత్నం చేయలేదు. ఇదొక్కటే చాలా విషయాల్లో వైసీపీ వ్యూహం వేయలేక చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుండడం గమనార్హం. మరి మున్ముందు ఏమైనా మారతారేమో చూడాలి.