దావోస్ లో ఇరగదీస్తున్న సీఎం రేవంత్..

ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా అంతకంతకూ దూసుకెళుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు దావోస్ కు వెళ్లిన ఆయన తిరిగి వచ్చే నాటికి భారీ పెట్టుబడుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చేలా కనిపిస్తోంది. తొలుత హైదరాబాద్ కు చెందిన మేఘాతో డీల్ కుదుర్చుకోవటంపై కొద్దిపాటి విమర్శలు వచ్చాయి. ఈ డీల్ కోసం అంత దూరాన ఉన్న దావోస్ లోనే చేసుకోవాలా? హైదరాబాద్ లో చేసుకోకూడదా? అని. ఇదే మాటను కాస్త అటు ఇటుగా మాజీ మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ తో చెప్పేశారు.

అయితే.. కేసీఆర్ పదేళ్ల పాలన సందర్భంగా మంత్రి హోదాలో పెట్టుబడుల కోసం దావోస్ వెళ్లిన కేటీఆర్ సైతం ఇలాంటి పనులే చేసినా.. ఆయన ఆ విషయాన్ని మర్చిపోయి.. సీఎం రేవంత్ ను ఎటకారం ఆడేశారు. ఇదిలా ఉండగా.. చూస్తుండగానే.. ఒకటి తర్వాత ఒకటి చొప్పున భారీ డీల్స్ కు ఓకే చేసుకుంటూ పోతున్న సీఎం రేవంత్ దూకుడు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. బుధవారం ఒక్కరోజులో రికార్డుస్థాయిలో పెట్టుబడుల్ని తెలంగాణకు ఆకర్షించి హైలెట్ అయిన ఆయన.. గంటల వ్యవధిలోనే మరో భారీ పెట్టుబడి డీల్ ను ఓకే చేసుకున్నారు.

తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకేల్ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్. తెలంగాణలో రూ.60 వేల కోట్ల పెట్టబడి పెట్టేందుకు వీలుగా అమెజాన్ తోఒప్పందం చేసుకున్నారు. ఈ పెట్టుబడితో రాష్ట్రంలో డేటా సెంటర్లను అమెజాన్ విస్తరించనుంది. వీటికి అవసరమైన భూమిని కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

మరోవైపు ఇన్ఫోసిస్ సీఎఫ్ వో సంగ్రాజ్ తో తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు భేటీ కావటం.. పోచారం ఐటీ క్యాంపస్ విస్తరణకు ఇన్ఫోసిస్ ఓకే చెప్పింది. ఇందులో భాగంగా రూ.750 కోట్లతో తొలిదశ విస్తరణ చేపడతామని సదరు సంస్థ తెలిపింది. ఈ విస్తరణ నేపథ్యంలో కొత్తగా 17వేల ఉద్యోగాలు వస్తాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒకటి తర్వాత ఒకటి చొప్పున భారీ ఒప్పందాలతో దావోస్ లో అదరగొట్టేస్తున్నారు సీఎం రేవంత్.