గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా సత్తా చాటిన యంగ్ పొలిటీషియన్ గానూ మనందరికీ చిర పరచితులే. సుదీర్ఘ కాలం పాటు చంద్రబాబుకు రాజకీయ విరోధిగా సాగిన గల్లా అరుణ కుమారి కుమారుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జయదేవ్.,.. తన ఫ్యామిలీని టీడీపీకి చేరువ చేశారు.
అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన నేపథ్యంలో గల్లా జయదేవ్ ఎంపీగా ఉన్నప్పటికీ అటు ఆర్థికంగానే కాకుండా ఇటు రాజకీయంగానూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న వార్తలు ఏపీ వాసులను కలచివేశాయి. ఈ కారణంగానే గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించాల్సి వచ్చిందని, శారీరకంగానూ ఆయన హింసను ఎదుర్కొన్నారన్న వాదనలూ లేకపోలేదు. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం ఉందో తెలియదు గానీ.. గల్లా అయితే అడ్రెస్ లేకుండా పోయారు.
ఎంపీగా ఉన్న తొలినాళ్లలో నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలిచిన గల్లా…తాజాగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల పుణ్యమా అని దావోస్ లో కనిపించారు. ఈ సదస్సుల ప్రారంభం రోజే దావోస్ వచ్చిన గల్లా… సీఎం చంద్రబాబును కూడా కలిశారు. అయితే సదస్సుల్లో మూడో రోజు అయిన బుధవారం గల్లా చురుగ్గా కదిలారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో కలిసి కనిపించిన గల్లా… పలు కీలక భేటీల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ తోనూ ఆయన చర్చిస్తూ కనిపించారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో చూసిన వారంతా గల్లా తిరిగి యాక్టివేట్ అయినట్టేనా?అని ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారు.