తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ

ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో ఈ న్యాయ విచారణ జరుగుతుందని తెలిపింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి… 6 నెలల్లోగా నివేదిక సమర్పించాలంటూ కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునే అవకాశాన్ని వీఐపీలకే కాకుండా సామాన్య భక్తులకూ కల్పిస్తూ గత ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తిరుపతి, తిరుమలలో టోకెన్ల జారీకి కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది టోకెన్ల జారీ కోసం కూటమి సర్కారు భారీ ఏర్పాట్లు చేసింది. అదే సమయంలో టోకెన్ల జారీకి సంబంధించి టీటీడీ భారీ ఎత్తున ప్రచారం చేసింది. దీంతో తొలి రోజే ఊహించని రీతిలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఈ క్రమంలో తిరుపతిలోని బైరాగిపట్టెడ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కౌంటర్ వద్దకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఊహించని రీతిలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 39 మంది గాయపడ్డారు.స్వామి వారి దర్శనం కోసం వచ్చి భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగానూ కలకలం రేపింది. ఈ ఘటనపై ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ తరఫున చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు. అయినా విపక్షాలు ఈ ఘటనను రాజకీయం చేయడంతో ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.