చైనాను ‘స్మార్టు’గా దెబ్బ కొట్టేందుకు వ్యూహం

సరిహద్దుల్లో ప్రతిరోజు చికాకులు సృష్టిస్తు అనవసరంగా ఉధ్రిక్తతలను పెంచుతున్న డ్రాగన్ ను దెబ్బకొట్టడానికి కేంద్రప్రభుత్వం స్మార్టుగా ఆలోచిస్తోంది. చైనాను ఆర్ధికంగా దెబ్బకొట్టడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం పావులు కదుపుతోందని సమాచారం. ఇందులో భాగంగానే ఇప్పటికే 177 చైనా యాప్ లను నిషేధించిన కేంద్రం తొందరలోనే స్మార్ట్ మొబైల్ ఫోన్లను నిషేధించటంపైన కూడా గట్టిగా ఆలోచిస్తోందట. యాప్ ల నిషేధం వల్లే చైనాకు వేలకోట్ల రూపాయల నష్టం జరిగింది. ఈ నష్టాన్ని మరింతగా పెంచటమే వ్యూహంగా కేంద్రం అనేక మార్గాలను అన్వేషిస్తోంది. చైనా నుండి దిగుమతవుతున్న స్మార్ట్ ఫోన్ల అమ్మకాలపై నిషేధం కూడా ఒకటి.

ప్రపంచం మొత్తం మీద స్మార్ట్ ఫోన్లను అత్యధికంగా వాడుతున్న దేశాల్లో మనదేశం కూడా ఒకటి. 2019 లెక్కల ప్రకారం మనదేశంలో సుమారు 45 కోట్లమంది స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారట. వీటిల్లో అత్యధికం డ్రాగన్ దేశంనుండి దిగుమతవుతున్న ఫోన్లే కనిపిస్తున్నాయి. మనదేశంలో దూసుకుపోతున్న చైనా ఫోన్లు షియామీ, ఒప్పో, వన్ ప్లస్, వివో, లెనోవోలు ఎక్కువగా కనబడుతున్నాయి. వీటిలో కూడా షియామీ ఫోన్ల షేరే సుమారు 20 శాతం ఉందట. దీని తర్వాత వన్ ప్లస్ ఫోన్లు వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది.

అత్యధిక ఫీచర్లు, తక్కువ ధరల్లో దొరుకుతున్న కారణంగా చైనా ఫోన్ల వాడకం మనదేశంలో బాగా పెరిగిపోతోంది. మనదేశంలో ప్రతి ఏడాది అమ్ముడవుతున్న స్మార్టు ఫోన్లు సుమారు 15.80 కోట్లని లెక్క. ప్రతి సంవత్సరం మనదేశంలో సుమారు రూ. 2.13 లక్షల కోట్ల స్మార్టు ఫోన్ల వ్యాపారం జరుగుతోంది. వీటిలో చైనా ఫోన్ల బిజినెస్సే దాదాపు 75 శాతం అంటే 1.39 లక్షల కోట్లుంటుందని అంచనా. అయితే చైనా ఫోన్లను నిషేదించటం అంత ఈజీ కాదు. ఎందుకంటే రెండు దేశాల మధ్య వ్యాపారపరమైన అనేక ఒప్పందాలుంటాయి. ఏకపక్షంగా ఆ ఒప్పందాలను రద్దు చేసుకోవటం సాధ్యంకాదు. పైగా మనదేశాన్ని కమ్ముకుంటున్న చైనా స్మార్ట్ ఫోన్ల స్ధానంలో ఇతర కంపెనీల ఫోన్లను తీసుకురావటం అనుకున్నంత సులభంకాదు.

కోట్లాది స్మార్ట్ ఫోన్ల దిగుమతులను ఒక్కసారిగా నిషేధిస్తే ప్రత్యామ్నాయంగా ఇతర కంపెనీలు ఒక్కసారిగా తమ ఉత్పత్తిని పెంచటం సాధ్యంకాదు. కాకపోతే చైనా కంపెనీలను నిషేధించగలిగితే నోకియాతో పాటు మన కంపెనీల ఉత్పత్తులైన మైక్రోమ్యాక్స్, లావా, కార్బన్ లాంటి కంపెనీలకు గిరాకీ పెరిగే అవకాశం ఉంది. యాప్ లను నిషేధించిందంటే మన దేశంలోని పౌరుల సమాచారం అంతా యాప్ ల ద్వారా చైనాకు చేరుతోందనే ఆరోపణలను కారణంగా చూపించి అత్యవసరంగా నిషేదించగలిగింది. కానీ స్మార్టు ఫోన్లను నిషేధానికి ఎటువంటి కారణాలు చూపించాలనే విషయంలో కసరత్తు జరుగుతోంది. అందుబాటులో ఉన్న ఐటి చట్టాలు, చైనా వ్యాపార ఒప్పందాలు అనుమతిస్తే వెంటనే నిషేధం పడటం ఖాయం. అదే జరిగితే చైనాకు లక్షల కోట్ల రూపాయల నష్టం తప్పదు.