కాళేశ్వరం వివాదం.. కీలక వివరాలతో వచ్చిన వి.ప్రకాశ్

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని కమిషన్ ముందు వెల్లడించారు. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఈ అంశంపై విచారణ చేపట్టగా, వి.ప్రకాశ్ 101వ సాక్షిగా హాజరై తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయించారు.

తన వద్ద ఉన్న కీలక సమాచారం, డాక్యుమెంట్ల ఆధారంగా గతంలోనే స్టేట్‌మెంట్, నోట్ సమర్పించినట్లు వెల్లడించిన ప్రకాశ్, ప్రాజెక్టు ప్రణాళికలు, నిర్మాణ దశల్లో తీసుకున్న నిర్ణయాలపై కమిషన్ పలు ప్రశ్నలు వేసినట్లు తెలిపారు. ముఖ్యంగా తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యత, మహారాష్ట్ర అభ్యంతరాల కారణంగా సైట్ మార్పులపై కమిషన్ దృష్టి సారించిందని చెప్పారు.

విచారణలో మేడిగడ్డ వద్ద నిర్మాణానికి సంబంధించిన ఇంజినీర్ల సిఫార్సులు, బొగ్గు గనుల దగ్గర సొరంగాల అంశాలు కీలకంగా చర్చకు వచ్చినట్లు వివరించారు. ఈ అంశాలపై నాటి ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించాల్సి వచ్చిందని ప్రకాశ్ వెల్లడించారు. నీటి లభ్యత, పునాదుల సురక్షితత ఆధారంగా కాళేశ్వరాన్ని నిర్మించినట్లు ఆయన కమిషన్‌కు తెలిపారు.

ప్రాజెక్టు నిర్మాణంలో డాక్యుమెంట్ల ఆధారంగా మాత్రమే తాము ముందుకు సాగినట్లు స్పష్టం చేసిన ప్రకాశ్, కాళేశ్వరం ప్రాజెక్టు పునాది నుంచి వివిధ దశల వరకు తీసుకున్న నిర్ణయాలపై పూర్తిస్థాయి వివరణ ఇచ్చారు. ఈ విచారణతో కాళేశ్వరం వివాదం మరింత చర్చనీయాంశంగా మారుతోంది. గత ప్రభుత్వ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆర్థిక నెరరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో మరికొంత మంది ప్రముఖులను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.