అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం పదవీ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ దఫా అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ట్రంప్.. మరోమారు అధ్యక్ష పదవి చేపట్టే దాకా వదిలిపెట్టలేదు. రిపబ్లికన్ పార్టీలో హేమాహేమీలు ఉన్నా.. తొలి టెర్మ్ లో తన నిర్ణయాలు పెను వివాదం రేపినా కూడా… ఆ పార్టీ తరఫున ముచ్చటగా మూడో పర్యాయం అధ్యక్ష అభ్యర్థిగా అవకాశం చేజిక్కించుకున్నారు. తాను అనుకున్నట్లుగా రెండో పర్యాయం అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి పదవీ బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే తనదైన శైలి దూకుడును ప్రదర్శిస్తున్న ట్రంప్… ప్రపంచ దేశాలన్నీ తనవైపు చూసేలా చేసుకున్నారు. అధ్యక్షపదవి చేపట్టిన వెంటనే పలు కీలక అంశాలపై సంచలన నిర్ణయాలు తీసుకున్న ట్రంప్… తన కేబినెట్ కూర్పులోనూ తన మార్క్ ను చాటుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా ట్రంప్ బిలియనీర్ కిందే లెక్క. తాను బిలియనీర్ అయినప్పుడు…తన కేబినెట్ కూడా బిలియనీర్లతోనే నిండి ఉండాలి అనుకున్నారో, ఏమో తెలియదు గానీ.. తన కేబినెట్ ను ఆయన బిలియనీర్లతో నింపేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత.. అద్యక్ష పదవి చేపట్టక ముందే… ప్రపంచంలోనే అపర కుబేరుడిగా కొనసాగుతున్న టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ను తన సలహాదారుగా ట్రంప్ నియమించుకున్నారు. తాజాగా 24 మందితో ట్రంప్ తన కేటినెట్ ను ఏర్పాటు చేసుకున్నారు. వీరిలో ఏకంగా 13 మంది బిలియనీర్లేనట. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల్లో భాగంగా ఆక్స్ ఫాయ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. సగానికి పైగా మంత్రులను బిలియనీర్లనే ఎంచుకున్న ట్రంప్… తన కేబినెట్ కు బిలియనీర్ల కలర్ ను ఇచ్చేశారని సదరు నివేదిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.