ఓటు బ్యాంకును స్థిరం చేసుకోవటానికి జగన్ మాస్టర్ ప్లాన్

ఏ పార్టీ హామీ ఇచ్చినా, ఏ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నా అంతిమలక్ష్యం అధికారం అందుకోవటమే. ఓటు బ్యాంకు రాజకీయాలు ఎక్కువయిపోతున్న మన దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఇటువంటి వ్యూహాలే కనబడుతున్నాయి. మన రాష్ట్రంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇదే ఓటుబ్యాంకు రాజీకీయాలతో ఆచరణ సాధ్యంకాని హామిలిచ్చి 2014లో చంద్రబాబు లబ్దిపొందిన విషయం అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత తానిచ్చిన హామీలను అమలు చేయలేకపోవటంతో 2019లో జగన్మోహన్ రెడ్డికి జనాలు అఖండ మెజారిటినిచ్చి అధికారం అప్పగించారు.

సరే అధికారంలో వచ్చిన తర్వాత నుండి తానిచ్చిన హామీలను అమలుకు జగన్ నానా తంటాలు పడుతున్న విషయం అందరు చూస్తున్నదే. చంద్రబాబుకు ఎదురైన అనుభవాన్ని గమనించిన జగన్ రాష్ట్రాదాయంలో ఎక్కువభాగం సంక్షేమ పథకాలకే ఖర్చు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బీసీలపై ఎక్కువగా దృష్టిపెట్టారు. బీసీలపైనే ఎందుకంటే సమాజంలో వీళ్ళ జనాభా అయినా ఓట్ షేర్ అయినా దాదాపు సగం ఉందికాబట్టే. పార్టీ ఏర్పాటు చేసిన దగ్గర నుండి టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్న బీసీలు మొట్టమొదటిసారిగా బయటకు వచ్చేసి వైసీపీకి మద్దతుగా నిలిచారు.

బీసీల మద్దతుతో పాటు కాపుల్లో మెజారిటి సెక్షన్, ఇక మొదటినుండి మద్దతుగా నిలుస్తున్న మైనారిటిలు, క్రిస్టియన్ మైనారిటిలు, రెడ్లలో మెజారిటి సాలిడ్ గా ఓటు చేయటంతో అఖండ విజయం సాధ్యమైంది. టీడీపీని వదిలేసి వచ్చిన బీసీల ఓటుబ్యాంకును శాశ్వతంగా అట్టిపెట్టుకునేందుకు జగన్ కుల వ్యూహం అమలు చేస్తున్నారు. అదేమిటంటే చాలా కాలంగా వినిపిస్తున్న డిమాండ్ బీసీల్లో ఉపకులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు పంప్ చేయటం జగన్ చేశారు. ఆ వర్గాల కోసం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. వీటికి ఈనెల 18వ తేదీన ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించబోతున్నారు.

అలాగే మొత్తం కార్పొరేషన్లలో సగాన్ని మహిళలకు కేటాయించనున్నారు. ఇక డైరెక్టర్ల నియామకంలో 50 శాతం మహిళలకే ఇస్తున్నారు. కీలక పదవులు రెడ్లకు ఇచ్చి పవర్ లేని పదవులు బీసీలకు ఇస్తున్నారు అనే ఆరోపణలున్నా… పదవులైతే ఇస్తున్నారన్న పేరొస్తోంది. అంతేకాదు, వైసీపీ నేతలకు ఈ పదవుల పంపకం ద్వారా అంతర్గత ప్రజాస్వామ్యం పెచ్చరిల్లకుండా ప్లానేశారు జగన్.

అంటే ఒకే దెబ్బకు రెండు మూడు పిట్టలన్నట్లుగా ఒకవైపు బీసీల ఓట్లు అదే సమయంలో మహిళల ఓట్లను పదిలం చేసుకోవటంతో పాటు పార్టీలో అసంతృప్తిని తగ్గించే భారీ వ్యూహం అమలు చేస్తున్నారు. ఇప్పటికే స్పీకర్ పదవితో పాటు ఏడుగురు మంత్రులను కూడా బీసీ వర్గాలకే కేటాయించారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో 2.71 కోట్లమంది బీసీ లబ్దిదారులకు ఏదో ఓ పథకం అందిందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇదే సమయంలో బీసీల సమస్యల పరిష్కారం కోసం శాశ్వత బీసీ కమీషన్ ఏర్పాటు కూడా కీలకమైందే. మొత్తంమీద జగన్ వ్యూహం గనుక అమలైతే వైసీపీకి శాశ్వత ఓటుబ్యాంకు ఖాయం చేసుకున్నట్లే అనుకోవాలి.