టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. ఓకప్పుడు తెలంగాణ మంత్రిగా ఉన్న బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పోల్చుకునేవారు. కేటీఆర్ పనితీరుకు.. తన పనితీరుకు 2014-19 మధ్య కాలంలో భేరీజు వేసుకునేవారు. అంతేకాదు.. తెలంగాణలో ఐటీ శాఖను మంత్రిగా కేటీఆర్ చూసేవారు. అదే సమయంలో 2017-19 మధ్య మంత్రిగా ఉన్న నారా లోకేష్‌కు అప్పట్లో ఇదే శాఖను అప్పగించారు. దీంతో ఇద్దరు నేతల మధ్య పోలిక పెడుతూ.. అనేక విశ్లేషణలు వచ్చాయి.
ఇక, ఏటా జరిగే దావోస్ ప్రపంచ పెట్టుబడుల సదస్సులో అప్పట్లో పోటా పోటీగా కేటీఆర్.. నారా లోకేష్‌లు పెట్టుబడుల కోసం తీవ్రంగా శ్రమించారు. మరోవైపు.. బీఆర్ఎస్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ నియమితులయ్యారు. ఆ క్రమంలో అప్పట్లోనే టీడీపీలో నారా లోకేష్‌కు ప్రాధాన్యం పెంచాలన్న డిమాండ్ వినిపించింది. కొన్నాళ్లు ఆ కసరత్తు కూడా జరిగింది. అయితే.. తర్వాత కాలంలో ఈ డిమాండ్ పక్కకు వెళ్లినా.. తరచుగా కేటీఆర్‌తో మాత్రం పోలికలు ఉంటూనే ఉన్నాయి.
రెండోసారి వరుసగా టీడీపీ అధికారంలోకి రాలేకపోయింది. ఇక, ఇప్పుడు కూటమి సర్కారు ఏర్పాటు చేసుకున్న దరిమిలా.. నారా లోకేష్‌కు ప్రభుత్వంలో మంచి పాత్రే ఇచ్చారు. ఇక, ఇప్పుడు కూడా కేటీఆర్ గురించిన ప్రస్తావన రావడం.. ఆయనకు నారా లోకేష్‌కు పోలిక పెట్టడం రాజకీయాల్లో కనిపిస్తోంది. ఇక, కేటీఆర్‌ను మా నాయకుడు ఓవర్ టేక్ చేశాడంటూ.. తెలంగాణకు చెందిన ఒకరిద్దరు నాయకులు తాజాగా ప్రస్తావించారు. అంతేకాదు.. ఒకరకంగా కేటీఆర్‌ను దాటేసి ముందుకు దూసుకువెళ్లిపోయారని కూడా అంటున్నారు.
అటు ప్రభుత్వ పరంగానే కాకుండా.. ఇటు రాజకీయాల పరంగా కూడా నారా లోకేష్ దూకుడుగా ఉన్నారు. ముఖ్యంగా పాలన విషయంలో ఆయన వేస్తున్న అడుగులు నభూతో అనే చెప్పాల్సి ఉంటుంది. సమస్య లపై ఎప్పటికప్పుడు స్పందించడం.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం వంటివి కలిసి వస్తున్న పరిణామాలు. అంతేకాదు.. ప్రసంగాలు, కామెంట్లు.. వంటి విషయాల్లోనూ నారా లోకేష్ చాలా దూకుడుగానే ఉన్నారు. తాజాగా దావోస్ సదస్సులోనూ తనదైన శైలిని ఆయన ప్రదర్శించారు. ఈ పరిణామాలతో నారా లోకేష్ వ్యవహారంపై తెలంగాణలో ఆసక్తికర చర్చ జరుగుతుండడం గమనార్హం.