అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్.. తన హయాంలో దేశానికి స్వర్ణ యుగం తీసుకువస్తానని ప్రకటిం చారు. అమెరికాను ఆర్థిక, శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితిలో అమెరికాను ఆ దిశగా నడిపించడం అంటే.. అంత ఈజీకాదనే అభిప్రాయం పరిశీలకుల నుంచి వినిపిస్తోంది.
తనప్రసంగంలో ట్రంప్ ప్రస్తావించి నట్టు అనేక సమస్యలు, సవాళ్లు సైతం దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం.. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలక సవాలుగా మారగా.. దీనికి నిరుద్యోగం కూడా తోడైంది. ఈ రెండు అంశాలను ఛేదించి.. పాలనను సజావుగా ముందుకు సాగించడం కత్తిమీద నడకేనన్నది నిపుణుల అభిప్రాయం.
దేశ జీడీపీ గత రెండేళ్లతో పోల్చుకుంటే భారీగా పతమైందని ఇటీవల ఆర్థిక శాఖ వెల్లడించింది. దీంతో కొన్ని ఆర్థిక బిల్లులు కూడా నిలిచిపోయాయి. పైగా దేశీయ ఉత్పత్తి రంగం దెబ్బతింది. ఇజ్రాయెల్, ఉక్రెయిన్ యుద్ధాలపై అమెరికా వ్యవహరించిన తీరుతో పెట్టుబడి దారులు వెనక్కి తగ్గడం కూడా ఆర్థిక రంగంపై పెను ప్రభావం చూపించింది. ఇక, మరో కీలక విషయం.. రాజకీయ క్రీడలు.
కేంద్ర స్థాయిలో ట్రంప్ ఇప్పుడు అధికారంలోకి వచ్చినా.. రాష్ట్రాల స్థాయిలో చూసుకుంటే డెమొక్రాట్ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సో.. ట్రంప్ తీసుకునే నిర్ణయాలను రాష్ట్రాల స్థాయిలో ఆమోదించేందుకు డెమొక్రాట్లపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇది కూడా కష్టసాధ్యంగానే మారే అవకాశం ఉంది. ఇక, డ్రగ్స్, వలసలు, వీసాలు వంటివి సునిశితమైన అంశాలుగా మారాయి.
అంతర్జాతీయంగా వస్తున్న సవాళ్లకు తోడు.. వలసలు పెరుగుతుండడం.. వీసాల విషయంలో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అమెరికా భవిష్యత్తును మార్చే అవకాశం ఉన్నా.. ఈ నిర్ణయాలు ఆయన చెబుతున్నంత తేలిక అయితే కాదు. రాత్రికి రాత్రి ఏదీ జరిగిపోదు. దీనికి సుదీర్ఘ కసరత్తు కావాల్సి ఉంటుంది. మరోవైపు.. వీసాలు, వలసల విషయంలో ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో.. ఐటీపై ప్రభావం పడితే.. మరింతగా జీడీపీ తగ్గుముఖం పడుతుంది. ఇది మరింతగా దేశ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేస్తుంది.
ఇవన్నీ ఒక ఎత్తయితే.. ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించిన మరో కీలక అంశం.. సరిహద్దుల భద్రత. ముఖ్యంగా ఎర్ర సముద్రంలో తన ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు చైనా వేస్తున్న ఎత్తులను అమెరికా ఆది నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఈ సమస్య వెంటాడుతుంది. నేరస్తుల కట్టడికి కూడా.. ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆయన దృష్టిలో అంతర్జాతీయంగా నేరస్తులు తమ దేశంలోకి వలస వస్తున్నారని చెబుతున్నారు.
కానీ, వాస్తవానికి నిరుద్యోగ ప్రభావంతో అమెరికాలోనే నేరస్తులు తయారవుతున్నట్టు కొన్నాళ్ల కిందట ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లెక్కలు చెప్పుకొచ్చింది. అంటే.. నిరుద్యోగమే ఇప్పుడు.. ట్రంప్ కు పెద్ద సవాలుగా మారనుంది. మొత్తంగా చూస్తే.. ట్రంప్ దశ-దిశ ఎలా ఉన్నా.. ఆయన ముందు కనిపిస్తున్న సమస్యలు-సవాళ్లు అనేకం ఉండడం గమనార్హం.