అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ జే. ట్రంప్ పదవీ ప్రమాణం చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రంప్ దేశ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. దేశంలో వణికిస్తున్న చలి కారణంగా బహిరంగ వేదికను రద్దు చేసిన అధికార యంత్రాంగం భవనం లోపల అతి తక్కువ మంది అతిథుల మధ్య ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి కేవలం 500 మంది అతిథులకు మాత్రమే అనుమతి మంజూరు చేశారు.
అమెరికా 47వ అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేసిన ట్రంప్… దేశానికి రెండో సారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. జో బైడెన్ కంటే ముందు ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే గడచిన ఎన్నికల్లో బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోగా… తాజాగా జరిగిన ఎన్నికల్లో ట్రంప్ మరోమారు అధ్యక్ష పదవిని చేపట్టారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టగా… ఉపాద్యక్షుడిగా జేడీ వాన్స్ పదవీ ప్రమాణం చేశారు. వారితో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించారు.
ఇదిలా ఉంటే… ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేసిన కార్యక్రమానికి పదవి నుంచి దిగిపోతున్న జో బైడెన్ తో పాటు ఉపాధ్యక్షురాలిగా పదవిని వీడుతున్న కమలా హ్యారిస్, మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా హాజరయ్యారు. ఈ కార్యక్రానికి విశిష్ఠ అతిథులుగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు మార్క్ జుకెర్ బర్త్,, టిమ్ కుక్, సుందర్ పిచాయ్, ఎలాన్ మస్క్ హాజరయ్యారు. ఇక భారత్ నుంచి ఈ కార్యక్రమానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సతీసమేతంగా హాజరయ్యారు. భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హాజరయ్యారు.
ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా వాషింగ్టన్ డీసీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రెసిడెన్షియల్ భవనం పరిసరాల్లో ట్రాఫిక్ కు ఆంక్షలు విధించారు. దాదాపుగా 25 వేల మంది పోలీసులతో నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే వారిని పలు అంచెలుగా తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. మొత్తంగా 500 మంది అతిథులు మాత్రమే హాజరైన ఈ కార్యక్రమం భద్రత కోసం ఏకంగా 25 వేల మంది భద్రతా సిబ్బందిని వినియోగించడం గమనార్హం.