స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, ఇతర అధికారుల బృందం.. తొలుత జ్యూరిచ్‌లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయింది. ఎన్నారై నేతల ఆధ్వర్యంలో దావోస్ సదస్సుకు వచ్చిన తెలుగు పారిశ్రామిక వేత్తలను తొలుత ఈ సదస్సుకు ఆహ్వానించారు. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు పారిశ్రామిక వేత్తలు సుమారు 180 మంది హాజరయ్యారు. వీరిలో మహిళా పారిశ్రామిక వేత్తలు కూడా ఉన్నారు. వీరిని ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు.
ఈ సమావేశానికి వచ్చిన పారిశ్రామిక వేత్తలతో హాల్ అంతా నిండిపోవడం.. పలువురు నిలబడి ఉండడాన్ని చూసిన మంత్రి నారా లోకేష్.. ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందరూ తెలుగు వారేనని.. ఇంతమంది పారిశ్రామిక వేత్తలు ఈ జ్యూరిచ్ సమావేశానికి రావడం.. చంద్రబాబు ఘనతేనని చెప్పుకొచ్చారు. “ఇంత మంది తెలుగు పారిశ్రామిక వేత్తలను చూస్తుంటే.. మేం జ్యూరిచ్‌లో ఉన్నామో.. జువ్వల పాలెంలో ఉన్నామో.. అన్న సందేహం కలుగుతోంది” అని నారా లోకేష్ వ్యాఖ్యానిం చారు. దీంతో సమావేశంలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.
మా నాన్న విఫలమైనా..
ఈ సందర్భంగా చంద్రబాబు రాజకీయాల్లోనే కాకుండా.. వ్యాపార రంగంలోనూ అనేక ప్రయోగాలు చేశారని నారా లోకేష్ చెప్పారు. “మా నాన్న కేవలం రాజకీయ నాయకుడిగానే అందరికీ ఎక్కువగా తెలుసు. కానీ, ఆయనలో వ్యాపార వేత్త ఉన్నారు. తొలినాళ్లలోనే అనేక వ్యాపారాలు చేపట్టారు. అయితే.. మూడు వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి. చాలా నష్టాలు వచ్చాయి. అయినా వెనుదిరగలేదు. ఎంతో పట్టుదలతో హెరిటేజ్‌ను స్థాపించారు. ఇది నాలుగో వ్యాపారం. ఇది ఇప్పుడు లాభాల బాటలో సాగుతూ.. లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి చూపిస్తోంది.” అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.
ఆ ఘటనతో వణికి పోయాను!
వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని.. ఆ సమయంలో తాను చాలా వణికి పోయానని.. నారా లోకేష్ చెప్పుకొచ్చారు. కానీ, జైల్లో ఉండి కూడా తమకు ధైర్యం నూరిపోసిన నాయకుడు చంద్రబాబేనన్నారు. ఎంతో మంది తెలుగువారు.. ఏకతాటిపైకి వచ్చి.. తమ కోసం పోరాటం చేశారని, ఆ సందర్భాన్ని తాము ఎప్పటికీ మరిచి పోలేమని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం కష్టాల నుంచి బయటపడుతోందని.. ఈ సమయంలోనే తెలుగువారు ఎక్కడున్నా రాష్ట్రానికి సహకారం అందించాల్సి ఉందని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. పెట్టుబడులకు ఏపీ ఘన స్వాగతం పలుకుతోందని, ప్రతి ఒక్కరూ స్పందించాలని ఆయన సూచించారు.