‘తిక్క‌’మాట‌లు కావు.. ‘లెక్క’ పెట్టుకోవాల్సిందే బాబూ..!

రాజ‌కీయ పార్టీల భ‌విత‌వ్యం ఏంట‌నేది.. ఎవ‌రో ఎక్క‌డి నుంచో వ‌చ్చి.. స‌ర్వేలు చేసి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు చేసే కామెంట్లు.. వారు వ్య‌వ‌హ‌రిస్తున్నతీరు వంటివి.. పార్టీ భ‌విష్య‌త్తును, బ‌లాన్ని కూడా చెప్పేస్తాయి. గ‌తంలో అంతా బాగానే ఉంద‌ని.. తాము ఇచ్చిన సంక్షేమం ఎవ‌రూ ఇవ్వ‌డం లేద‌ని కాబ‌ట్టి.. ప్ర‌జ‌లు గుండుగుత్త‌గా త‌మ‌తోనే ఉన్నార‌ని వైసీపీ చెప్పింది. కానీ.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు మాత్రం ఏమంత బాగాలేద‌ని చెప్పుకొచ్చారు.

కానీ, వైసీపీలో మార్పు రాలేదు. ఫ‌లితం ఎలాంటిదో త‌ర్వాత కానీ అనుభ‌వంలోకి రాలేదు. ఇక‌, తాజాగా మరీ అంత రేంజ్‌లో కాక‌పోయినా.. కూట‌మి స‌ర్కారుకు నేతృత్వం వ‌హిస్తున్న టీడీపీలో క్షేత్ర‌స్థాయి నాయకులు ర‌గిలిపోతున్నారు. ఇప్ప‌టికే చాలా మంది బ‌య‌ట ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఏకంగా ఓ జిల్లా టీడీపీ చీఫే రెచ్చిపోవ‌డం మ‌రింత చ‌ర్చ‌కు దారితీసింది. “టీడీపీ జెండా కోసం జైలుకు వెళ్లినోళ్లు, రోడ్డుపై పోరాడినోళ్లు, ఆర్థికంగా నష్టపోయినోళ్లకు అన్యాయం జ‌రుగుతోంది” అని సీమ‌కు చెందిన కీల‌క నేత బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేశారు.

గ‌త కొన్నాళ్లుగా సీమ‌లోని ప‌లు జిల్లాల్లో బీజేపీ వ‌ర్సెస్ టీడీపీ నేత‌ల మ‌ధ్య వివాదాలు సాగుతున్నాయి. అయితే.. ఇంతగా ఎవ‌రు బ‌య‌ట ప‌డ‌లేదు. తాజాగా క‌ర్నూలు జిల్లా టీడీపీ చీఫ్‌, సీనియ‌ర్ నాయ‌కుడు తిక్కారెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ కోసం ప‌నిచేసిన త‌మ‌కు ఏం చేశార‌ని.. ఆయ‌న ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ‘అంత కష్టపడి అధికారంలోకి వస్తే జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలుగా చెప్పుకొనే వాళ్లు చేస్తున్నదేమిటి? టీడీపీ జెండాలు మోసిన కార్యకర్తల దగ్గర లంచాలు తీసుకుని ప‌నులు చేస్తున్నారు’ అని ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు.

అంతేకాదు.. “వైసీపీ నాయకుల అరాచకాలపై ప్రాణాలకు తెగించి పోరాడి, బుల్లెట్‌ గాయాల పాలయ్యాను. ఓడిపోయి ఇన్‌చార్జిలుగా చెప్పుకునేవాళ్లు ఎంపీని కట్టడి చేస్తారా? చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, లోకేశ్‌కు తెలిస్తే బాధపడతారు. ఎన్నికల్లో ఏ లీడరు ఎలా పనిచేశాడు? ఏ కార్యకర్త ఎలా కష్టపడ్డాడు? పని చేసినోళ్ల కు గుర్తింపు ఇస్తున్నామా..? ఆత్మపరిశీలన చేసుకోవాలి” అని తిక్కారెడ్డి నిప్పులు చెరిగారు. క‌ట్ చేస్తే.. ఈ వ్యాఖ్య‌లు గ‌తంలో వైసీపీలోనూ వినిపించాయి.

కొంద‌రికి ప‌దవులు ఇవ్వ‌డంపై అప్ప‌ట్లో సీనియ‌ర్ల‌ను ప‌క్కన పెడుతున్నార‌న్న చ‌ర్చ జ‌రిగింది. ఆ త‌ర్వాత‌.. ఇది తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. ఇది.. వైసీపీ ప‌రాజ‌యానికి అంతో ఇంతో ప‌నిచేసింది. ఇక‌, ఇప్పుడు ఇదే స‌మ‌స్య టీడీపీ ఎదుర్కొంటోంది. అయితే.. ఇది మొగ్గ ద‌శ‌లోనే ఉంది. కాబ‌ట్టి సాధ్య‌మైనంత వ‌ర‌కు దీనిని ప‌రిష్క‌రిస్తేనే బెట‌ర్ అనే సూచ‌న‌లు వ‌స్తున్నాయి. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.