రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే ఒకరు తీవ్ర వివాదాలకు కారణమైన విషయం తెలిసిందే. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈయన.. గతంలో మేధావిగా పరిచయం చేసుకున్నారు. రాజధాని ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. దీంతో చంద్రబాబు ఆయనకు పిలిచి పిల్లను ఇచ్చినట్టుగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. గెలిపించారు.
కానీ, గత ఏడు మాసాలుగా అనేక రూపాల్లో సదరు నేత వివాదాలకు కేంద్రంగా మారిపోయారు. ఒకసారి అయితే.. సరేలే.. కొత్తకదా! అనిసరిపుచ్చుకోవచ్చు. కానీ, తానే అంతా.. తనకే అంతా తెలుసుననే ధోరణితో సదరు ఎమ్మెల్యే విర్రవీగుతున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పైగా.. తమకు అందివచ్చిన నియోజకవర్గంలో ఇప్పుడు ఈ ఎమ్మెల్యే పెడుతున్న కుల చిచ్చు కారణంగా.. పార్టీ పటిష్టానికి కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మొత్తంగా ఈ పంచాయతీ ఇప్పుడు ముదిరింది.. తాజాగా ఉన్న అంచనాల ప్రకారం.. తాత్కాలికంగా అయినా.. సదరు ఎమ్మెల్యను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా.. స్థానికంగా పార్టీకి ఎదురవుతున్న వ్యతిరేకతను తగ్గించుకోవాలన్నది టీడీపీ వ్యూహం. అయితే.. ఇదేసమయంలో ప్రతిపక్ష వైసీపీ నేతలు దీనిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నట్టు జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సదరు ఎమ్మెల్యేను టీడీపీ కనుక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే.. ఆ వెంటనే ఆయనను తమ పార్టీలోకి చేర్చుకునే వ్యూహానికి వైసీపీ నేతలు తెరదీసినట్టు సమాచారం. ఎస్సీలను టీడీపీ అవమానిస్తోందని.. ఇప్పటికే వైసీపీ నాయకులు రాగాలు అందుకున్నారు. తద్వారా.. సదరు ఎమ్మెల్యేను తమ పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా.. కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి సంపాయించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఇది కామనే అయినా.. నిప్పును తెచ్చి.. ఒళ్లో కూర్చోబెట్టుకున్నట్టే అవుతుందని మరికొందరు వైసీపీ నాయకులు చెబుతున్నారు.
అయితే.. తర్వాత జరిగేది ఎలా ఉన్నా.. ముందు కూటమి సర్కారుపై వ్యతిరేకతను పెంచే వ్యూహంతో వైసీపీ ఇలాంటి స్టెప్ తీసుకుంటోందన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. ఏదేమైనాసదరు వివాదాస్పద ఎమ్మెల్యేపై టీడీపీ తీసుకునే నిర్ణయాన్ని వైసీపీ స్టెప్ వేయనుంది. ఇక, ఆ ఎమ్మెల్యే కూడా.. తన వైఖరిని మార్చుకునేందుకు ఇష్టపడడం లేదు. ఇరుగు పొరుగు ఎమ్మెల్యేలు, ఎంపీతోనూ ఆయన వివాదాలకే మొగ్గు చూపుతున్నారని స్థానికులు చెబుతున్నారు. కాబట్టి.. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.