న్యూ ఇయర్ సందర్బంగా టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి… బీజేపీ మహిళా నేత, సినీ నటి మాధవీలతల మధ్య నెలకొన్న పంచాయతీ అప్పుడే ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. అయితే జేసీ ఈ వివాదాన్ని ముగించే దిశగా అడుగులు వేసినా… ఎందుకనో గానీ మాధవీ లత ఈ వ్యవహారాన్ని అప్పుడప్పుడే వదలేలా కనిపించడం లేదు. జేసీపై కఠిన చర్యలు తీసుకునే దాకా ఆమె తగ్గేలా కనిపించడం లేదు.
న్యూ ఇయర్ నాడు మహిళల కోసం తాడిపత్రిలో తాను ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నానని…పట్టణ మహిళలంతా అక్కడికి రావాలంటూ జేసీ ఇన్విటేషన్లు పంపారు. ఈ ప్రకటన చూసినంతనే మాధవీ లత భగ్గుమన్నారు. మహిళలకు భద్రత లేని ఈ తరహా కార్యక్రమాలకు ఎవరూ వెళ్లరాదంటూ ఆమె కోరారు. మాధవీలత ప్రకటనపై జేసీ భగ్గుమన్నారు. సినిమాల్లో నటించే ఆమె ఓ వ్యభిచారి అంటూ పరుష పదజాలంతో దూషించారు. జేసీ వ్యాఖ్యలు వైరల్ కాగా…మాధవీ లతకు పెద్దగా సానుభూతి ఏమీ లభించలేదనే చెప్పాలి.
ఇలాంటి తరుణంలో జేసీ ఈ వివాదానికి తెర దించాలన్న దిశగా… మాధవీ లతకు బేషరతుగా సారీ చెప్పారు. తన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని కూడా ఆయన అన్నారు. జేసీ సారీ చెప్పిన తర్వాత తనకు జరిగిన అవమానాన్ని తలచుకుని మాధవీ లత బోరుమన్నారు. ఈ వీడియో కూడా వైరల్ అయిపోయింది. తన దు:ఖాన్ని ఆపుకునేందుకు యత్నించిన ఆమె… తాజాగా ఫిల్మ్ ఛాంబర్ ను ఆశ్రయించారు.
ఓ సినీ నటిగా కొనసాగిన తనకు ఫిల్మ్ ఛాంబర్ లో న్యాయం జరుగుతుందన్న భావనతోనే ఆమె ఛాంబర్ ను ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. తనను జేసీ అసభ్య పదజాలంతో దూషించారని, తనను ఆయన అనరాని మాటలు అన్నారని ఆమె ఛాంబర్ కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రకమైన చులకన బావం కలిగేలా జేసీ వ్యాఖ్యలు ఉన్నాయని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి మాధవీ లత ఫిర్యాదుపై ఛాంబర్ ఏ రీతిన స్పందిస్తుందో చూడాలి.