టీడీపీ… దేశ రాజకీయాల్లో ఓ ప్రభంజనం. ఆవిర్భవించిన 9 నెలల కాలంలోనే అధికారం చేజిక్కించుకున్న పార్టీగా టీడీపీపై ఉన్న రికార్డు ఇప్పటికీ చెరిగిపోలేదు. ఇకపై చెరిగిపోయే అవకాశాలు కూడా లేవు. అంతేనా… సంక్షేమ పాలనను కూడా దేశానికి పరిచయం చేసిన పార్టీగా టీడీపీకి గుర్తింపు ఉంది. రూ.2కే కిలో బియ్యం, వృద్ధాప్య పింఛన్లను పంపిణీ చేసిన టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రాామారావు పార్టీని అన్ని పార్టీలకు అందనంత ఎత్తులో నిలబెట్టారు. ఆ సంక్షేమాన్ని, నిబద్ధతను ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు కొనసాగిస్తూ ఉంటే… లోకేశ్ దానిని మరింతగా పెంచుతూ సాగుతున్నారు.
దేశంలోని దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలుస్తున్న టీడీపీ… తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ రథ సారథి బీజేపీకి కూడా మార్గదర్శిగా నిలిచింది. ఎన్డీఏలో టీడీపీ కూడా ఓ కీలక భాగస్వామిగానే ఉన్నా… ఇప్పుడు ఏకంగా బీజేపీకి మార్గదర్శిగా నిలిచిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. సంక్షేమ పథకాల రూపకల్పన, అమలులో టీడీపీది అందె వేసిన చెయ్యే కదా. అందుకే కాబోలు… టీడీపీని బీజేపీ ఆదర్శంగా తీసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఏపీలో అన్నా క్యాంటీన్లు అంటూ చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకం దేశంలో ఓ రేంజిలో పాపులర్ అయ్యింది. చాలా రాష్ట్రాలు చంద్రబాబు పథకాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వ ఆధ్వర్యంలో క్యాంటీన్లను ఏర్పాటు చేసి నామమాత్రపు రేట్లకు పేదలకు రుచికరమైన ఆహారాన్ని అందించాయి. ఈ పథకం పలు రకాల పేర్లతో ఇంకా అమలు అవుతోంది కూడా. అన్నా క్యాంటీన్లలో రూ.5కే భోజనాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. రోజుకు 3 పూటలా ఆహారాన్ని అందిస్తున్న ఈ పథకంలో… ప్రతి పూటకు రూ.5తో పేదలు కడుపు నింపుకుంటున్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. ఆ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ… శుక్రవారం తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ఇందులో భాగంగా… అన్నా క్యాంటీన్ల తరహాలో అటల్ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ప్రకటించారు. అన్నా క్యాంటీన్ల మాదిరే… అటల్ క్యాంటీన్లలోనూ రూ.5కే రుచికరమైన భోజనం లభించనుంది. బీజేపీ దివంగత నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి సంస్మరణార్థం ఈ పథకానికి అటల్ క్యాంటీన్లు అనే పేరు పెట్టినట్టు సమాచారం.
ఇక బీజేపీ మేనిఫెస్టోలో చాలా అంశాలు… మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ఇచ్చిన హామీలను పోలి ఉన్నాయి. ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లను పెంచి ఇవ్వనున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఉచిత గ్యాస్ సిలిండర్లను కూడా ప్రస్తావించిన నడ్డా… హోలీ, దీపావళిలకు ఉచిత సిలిండర్లను ఇస్తామని చెప్పారు. మహిళలకు, నెలకు రూ.2,500 ఆర్థిక చేయూతను అందిస్తామని తెలిపారు. మొత్తంగా టీడీపీ మేనిఫెస్టోను బీజేపీ ఫాలో అయిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.