ముహూర్తం కుదిరింది.. ఆ గ్యారెంటీలూ అమ‌లు!

తెలంగాణ‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన గ్యారెంటీల‌లొ ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని మాత్ర‌మే అమ‌లు చేసింది. ఇంకా మిగిలిన‌వి చాలానే ఉన్నాయి. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు వాటిని అమ‌లు చేస్తామ‌ని చెబుతున్నారే త‌ప్ప‌. అమ‌లు విష‌యంపై దృస్టి పెట్ట‌డం లేదు. దీనికి కార‌ణం… ఫైనా న్స్ ప్రాబ్ల‌మే! ఇప్ప‌టికే అమ‌లు చేస్తున్న ఉచిత బ‌స్సు వ్య‌వ‌హారం స‌ర్కారుకు త‌ల‌నొప్పిగా మారింది. అయినా.. పంతం కొద్దీ దీనిని కొన‌సాగిస్తున్నారు.

మ‌రోవైపు గ్యారెంటీల అమ‌లుపై విప‌క్షాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వాటిని అమ‌లు చేయాల‌ని స‌ర్కారు నిర్ణ‌యించింది. మ‌రోవైపుఎన్నిక‌లు ముంచుకువ‌స్తున్నాయి. స్థానిక సంస్థ‌ల్లో స‌త్తా చాటాలంటే.. ఖ‌చ్చితంగా ఆయా ప‌థ‌కాల్లో కొన్నింటినైనా గాడిలో పెట్టాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే కొన్ని ప‌థ‌కాల‌కు ఈ నెల 26(గ‌ణ‌తంత్ర దినోత్స‌వం) నుంచి అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించి న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొన్నాయి.

ప్ర‌ధానంగా ప్రభుత్వం మరో నాలుగు కొత్త పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. జనవరి 26 నుంచి రైతు భరోసా- పంట పెట్టుబడి సాయం ఇవ్వాల‌ని త‌ద్వారా ఖ‌రీఫ్‌కు సానుకూలంగా ఉంటుంద‌ని రైతుల‌కుమేలు చేస్తుంద‌ని భావిస్తున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను కూడా అమ‌లు చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక‌, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను అమలు చేయనున్నారు.

ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి లబ్ధిదారుల జాబితా తయారు చేయ‌నున్న‌ట్టు తెలిసింది. ల‌బ్ధి దారుల‌ను ఫీల్డ్ సర్వే ద్వారా రెండు నుంచి మూడు వ‌డ‌పోత‌ల్లో ఎంపిక చేయ‌నున్న‌ట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే.. వీటికి సొమ్ములు ఎక్క‌డ నుంచి తెస్తార‌న్న‌ది చూడాలి. ఏదేమైనా.. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల నుంచి కొంత‌లో కొంతైనా త‌ప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు సంకేతాలు వ‌స్తున్నాయి.