షాకింగ్ అంశం వెలుగు చూసింది. సాధారణంగా ఒక జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మీద తీవ్ర ఆరోపణలు రావటం చాలా అరుదు. తాజాగా అలాంటి ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. హర్యానా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మీద తాజాగా గ్యాంగ్ రేప్ ఆరోపణలు వెల్లువెత్తటం సంచలనంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీ.. సింగర్ రాకీ మిట్టల్ అకా జై భగవాన్ పై గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది. దీనికి కారణం ఢిల్లీకి చెందిన ఒక యువతి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేశారు.
తనపై గ్యాంగ్ రేప్ 2023 జులై మూడున తన ఓనర్.. ఫ్రెండ్ తో కలిసి హిమాచల్ ప్రదేశ్ వచ్చినప్పుడు ఈ దారుణం చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ లోని కసౌలీకి తానో టూరిస్టుగా ఫ్రెండ్ తో కలిసి వెళ్లానని చెప్పిన ఆమె.. ఆ హోటల్ లో తాను బడోలీ.. మిట్టల్ ను కలిసినట్లుగా పేర్కొన్నారు. అయితే.. తాను తీసే అల్బమ్ లో నటిగా మారేందుకు అవకాశం ఇస్తానని తనతో మిట్టల్ చెప్పారన్నారు.
మరోవైపు తన స్నేహతుడు బడోలీ సీనియర్ పొలిటీషియన్ అని.. అతనికి పెద్ద స్థాయిలో పరిచయాలు ఉన్నాయని.. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ప్రలోభ పెట్టినట్లుగా పేర్కొన్నారు. ఈ క్రమంలో తన చేత బలవంతంగా మద్యం తాగించి.. తన స్నేహితురాలిని పక్కకు తీసుకెళ్లారని ఆరోపించిన ఆమె.. ‘‘ఆ ఇద్దరు నాపై అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. నా నగ్న చిత్రాలు.. వీడియోల్ని తీసుకున్నారు’ అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఢిల్లీ యువతి చేసిన ఫిర్యాదుతో నిందితులపై 376డి, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సోలన్ ఎస్పీ గౌరవ్ సింగ్ వెల్లడించారు. ఈ ఉదంతంలో ఇప్పటివరకు ఎలాంటి అరెస్టు చేయలేదని చెప్పారు. ఒక ప్రముఖ నేత మీద ఈ స్థాయిలో ఆరోపణలు రావటం ఇదే తొలిసారి. దీంతో..రాజకీయంగా ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ హాట్ గా మారింది.