ఎన్నికలకు ముందు రెడ్ బుక్ పేరుతో టీడీపీ నేతలు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన వారి పేర్లు రాసుకున్నానని చెప్పిన టీడీపీ యువ నాయకుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ మరోసారి ఈ విషయం పై వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ హయాంలో తప్పులు చేసిన వారి పేర్లు కూడా రెడ్ బుక్‌లో ఉన్నాయని, వారంతా త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన చెప్పుకొచ్చారు. రెడ్ బుక్ తన పని మొదలు పెట్టిందని.. ప్రస్తుతం వేగంగా పని జరుగుతోందని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
మద్యం, ఇసుక కుంభకోణాల్లో పదుల సంఖ్యలో బాధ్యులు ఉన్నారని వారంతా త్వరలోనే జైలుకువెళ్లడం తప్పదని నారా లోకేష్ హెచ్చరించారు. రెడ్ బుక్‌ను నేను మరిచిపోయానని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, నేనేం మరిచిపోలేదు. రెడ్ బుక్ పని సాగుతోంది అని వ్యాఖ్యానించారు. నారా వారి పల్లెలో సంక్రాంతి సంబరాలకు వచ్చిన నారా లోకేష్ బుధవారం సాయంత్రం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారిని తాను గుర్తు పెట్టుకున్నానని.. వారికిన్యాయం చేస్తామని చెప్పారు.
ఇక, పార్టీలో పదవులు ఆశించేవారు.. తనను కలవాలని కోరుకుంటున్నట్టు తెలిసిందని.. కానీ, ఇలా పదే పదే తనను కలవాలని ప్రయత్నించినా పదవులు రావన్నారు. పార్టీ కోసం పనిచేసేవారికే పదవులు దక్కు తాయని చెప్పారు. పైపై పనిచేసిన వారు ఎవరు? పార్టీకోసం నిజాయితీగా పనిచేసిన వారు ఎవరు? అనే విషయాన్ని తాను గమనిస్తున్నట్టు చెప్పారు. వారికే పదవులు దక్కుతాయన్నారు. నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా వ్యవహరించాలని నారా లోకేష్ సూచించారు.
వచ్చే నెల నుంచి పార్టీని బలోపేతం చేసేలా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్టు నారా లోకేష్ చెప్పారు. ఈ క్రమంలోనే స్వర్ణాంధ్ర పేరుతో ఈ ఏడు మాసాల్లో కూటమి ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివ రించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. దీనిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు. ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించాలని యాక్టివ్‌గా ఉండాలని ఆయన కోరారు. కలివిడిగా ఉండి .. కూటమి పార్టీల నాయకులతో ముందుకు సాగాలని సూచించారు.
పొలిట్ బ్యూరోపై సంచలన వ్యాఖ్యలు..
టీడీపీలో కీలకమైన విభాగం పొలిట్ బ్యూరో. పార్టీ తీసుకునే విధాన పరమైన నిర్ణయాలకు ఈ విభాగమే కీలకం. తాజాగా దీనిపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొలిట్ బ్యూరోను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి 30 శాతం మంది కొత్తవారిని పొలిట్ బ్యూరోలోకి తీసుకోవా ల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అప్పుడే పార్టీలో చలనం వస్తుందని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ సందర్భంగా ఆయన పొలిట్ బ్యూరోలోని సీనియర్ నేతలపై నేరుగా విమర్శలు చేయకపోయినా.. కొందరు వ్యవహరిస్తున్న తీరును మాత్రం ఆయన పరోక్షంగా ప్రస్తావించడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates