తెలంగాణకు సిసలైన సంక్రాంతి వచ్చింది…!

తెలుగు నేలలో ఇప్పుడు సంక్రాంతి సంబరాలు హోరెత్తుతున్నాయి. ఈ పండుగ వేళ తెలంగాణకు నిజంగానే అదిరిపోయే గిఫ్ట్ దక్కిందని చెప్పాలి. ఏళ్ల తరబడి తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్న జాతీయ పసుపు బోర్డు సరిగ్గా సంక్రాంతి పర్వదినాన నిజామాబాద్ లో ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా ఢిల్లీ నుంచి బోర్డు ను ప్రారంభించనున్నారు.

ఇదిలా ఉంటే.. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నిజామాబాద్ కే చెందిన పల్లె గంగా రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఇప్పటికే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. నేడు పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో ఆయన నేరుగా పలు పంచుకోనున్నారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ కు చెందిన వారే ఈ గంగా రెడ్డి. ఈ గ్రామంలోనే అత్యధిక సంఖ్యలో పసుపు రైతులు ఉన్నారు.

మరోవైపు నిజామాబాద్ ఎంపీ గా కొనసాగుతున్న బీజేపీ యువనేత ధర్మపురి అరవింద్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి గా బరిలోకి దిగిన అరవింద్… తనను గెలిపిస్తే రాష్ట్రానికి పసుపు బోర్డు తీసుకుని వస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ హామీతోనే ఆ ఎన్నికల్లో బలమైన అభ్యర్థిగా బరిలోకి దిగిన కవితను ఆయన ఓడించారు. ఎన్నికల్లో గెలవగానే నిజామాబాద్ కు పసుపు బోర్డు ను తీసుకురావడానికి ఆయన తీవ్రంగానే కృషి చేశారు. అయితే 2024 ఎన్నికలదాకా అదుగో ఇదుగో అంటూ కేంద్రం సాగదీసింది. అయినా కూడా అరవింద్ ను నిజామాబాద్ ప్రజలు రెండోసారి కూడా ఎంపీ గా గెలిపించారు. దీంతో అరవింద్ ఒత్తిడితో కేంద్రం తాజాగా పసుపు బోర్డు ను ప్రారంభించేందుకు ఒప్పుకుంది.