మ‌న‌వ‌డి ఆట‌లు.. స‌తీమ‌ణి ఆనందాలు.. చంద్ర‌బాబు ఖుషీ ఖుషీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు భోగిని పుర‌స్క‌రించుకుని ఖుషీఖుషీగా గ‌డిపారు. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా.. చంద్ర గిరి మండ‌లంలోని ఆయ‌న స్వ‌గ్రామం నారా వారి ప‌ల్లెలో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. మూడు రోజు ల‌ సంక్రాంతి ప‌ర్వ‌దినాల్లో తొలి రోజైన భోగిని పుర‌స్క‌రించుకుని భోగి మంట‌ల వేడుక‌లో పాల్గొన్నారు.

యువ‌తీయువ‌కుల‌కు పలు క్రీడా పోటీలను, మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు భావితరాలకు తెలియజేసే విధంగా ఈ పోటీలను నిర్వహించారు.

ఈ పోటీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు దేవాన్ష్ కూడా పాల్గొని సందడి చేశాడు. గోనె సంచులు రెండు కాళ్ల‌కు ధ‌రించి ముందుకు ఉరికారు. ఇత‌ర పిల్ల‌ల‌తోనూ క‌లిసి మెలిసి ఆడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భోగి, సంక్రాంతి పండుగలను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నానన్నారు.

క్రీడా స్ఫూర్తి చిన్నతనం నుంచే అల‌వ‌రుచుకోవాలన్నారు. ఈ కొత్త యేడాది మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.

అలాగే ముఖ్యమంత్రి నారావారిపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు. 15 ఈ-ఆటో లు, నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. అలాగే సబ్ స్టేషన్, ఎ.రంగంపేటలోని హైస్కూల్లో కోటి రూపాయలతో డిజిటల్ క్లాస్ నిర్మాణానికి ముఖ్య‌మంత్రి శంఖుస్థాపన చేశారు.

ఇక‌, స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి స్థానిక మ‌హిళ‌ల‌కు ముగ్గుల పోటీలు నిర్వ‌హించారు. ఆసాంతం ప్ర‌తి ముగ్గును తిల‌కించి మార్కులు వేశారు. అన్ని ముగ్గులు బాగున్నాయ‌ని పేర్కొన్నారు.

ముగ్గుల పోటీలో పాల్గొన్న‌వారికి బ‌హుమ‌తులు ఇవ్వాల‌ని అనుకున్నామ‌ని.. కానీ, అన్ని ముగ్గులు బాగుం డడంతో పాల్గొన్న 126 మంది మ‌హిళ‌లు, యువ‌తుల‌కు కూడా రూ.10116 చొప్పున కానుక‌లు ఇవ్వ‌నున్న ట్టు భువ‌నేశ్వ‌రి ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఆయా మ‌హిళ‌ల‌తోనూ ముచ్చ‌టించారు.

ప్ర‌భుత్వ ప‌నితీరును వారితో పంచుకున్నారు. ఉచిత గ్యాస్ ద్వారా వారికి ల‌భిస్తున్న ల‌బ్ధిని వివ‌రించారు. మ‌హిళా సాధికార‌త‌కు కృషి చేస్తున్న‌ట్టు వివ‌రించారు. మొత్తంగా అటు మ‌న‌వ‌డు, ఇటు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి, కోడ‌లు బ్రాహ్మ‌ణిల‌తో క‌లిసి చంద్ర‌బాబు ఖుషీఖుషీగా గ‌డ‌ప‌డం విశేషం.