మూడు రోజుల పాటు పాల‌నంతా `నారా వారి ప‌ల్లె` నుంచే!

సోమ‌వారం నుంచి మూడు రోజుల పాటు ప్ర‌భుత్వ పాల‌న అంతా అమ‌రావ‌తి నుంచి కాకుండా.. సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. నారా వారి ప‌ల్లె నుంచే జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు అధికార వ‌ర్గాలు అన‌ధికార ప్ర‌క‌ట‌న చేశాయి. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. అయితే.. ప్ర‌తి సంక్రాంతినీ ఆయ‌న సొంత గ్రామం చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి మండ‌లం, నారావారి ప‌ల్లెలో నిర్వ‌హించుకుంటున్నారు.

యావ‌త్ కుటుంబం అంతా కూడా.. నారా వారి ప‌ల్లెకు చేరుతుంది. అక్క‌డే మూడు రోజులు ఉంటారు. నంద‌మూరి ఫ్యామిలీ కూడా.. అక్క‌డకే వెళ్ల‌నుంది. అంద‌రూ క‌లిసి సంక్రాంతిని ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు.

ఈ నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు ఆదివారం రాత్రికే నారా వారి ప‌ల్లెకు చేరుకుంటారు. ఇక‌, కుటుంబ స‌భ్యులు ఆదివారం ఉద‌యా నికే అక్క‌డ‌కు చేరుకున్న‌ట్టు తెలిసింది. మ‌రోవైపు ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌య్య‌.. డాకూ మ‌హారాజ్ సినిమా విజ‌యోత్స వంతో ఆనందంగా ఉన్నారు. ఆయ‌న కూడా సోమ‌వారం ఉద‌యం లేదా సాయంత్రానికి నారా వారి ప‌ల్లెకు చేరుకుంటారు.

దీంతో వ‌చ్చే మూడు రోజులు(భోగి, సంక్రాంతి, క‌నుమ‌) నారా వారి ప‌ల్లెలో సీఎం స‌హా ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఈ వేడుక‌లు నిర్వ‌హించుకోనున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ పాల‌న అంతా అవ‌స‌ర‌మైన మేర‌కు నారా వారి ప‌ల్లె నుంచే జ‌రిగేలా చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు.

కీల‌క‌మైన సమీక్ష‌లు ఇప్ప‌టికే పూర్తి చేసిన నేప‌థ్యంలో ఇక‌, పాల‌న విష‌యంలో పెద్ద‌గా నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం లేదు. అయితే.. ఏదైనా అవ‌స‌రం అయినా.. మూడు రోజుల్లో స‌ర్కారు త‌ర‌ఫున నిర్ణ‌యాల‌న్నీ నారా వారి ప‌ల్లె నుంచే జ‌రిగేలా ఏర్పాట్లు చేశారు.

ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కూడా దాదాపు తిరుప‌తిలోనే ఉండ‌నున్న‌ట్టు తెలిసింది. మూడు రోజుల అనంత‌రం సీఎం చంద్ర‌బాబు తిరిగి అమ‌రావ‌తి చేరుకుంటారు. అంటే.. సోమ‌వారం నుంచి బుధ‌వారం వ‌ర‌కు ఆయ‌న నారా వారి ప‌ల్లెలోనే ఉండ‌నున్నారు.

కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. తొలి సంక్రాంతి కావ‌డంతో నారా వారి ప‌ల్లెలో మ‌రింత ఘ‌నంగా సంక్రాంతిని నిర్వ‌హించుకు నేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారి కుల దైవం నాగాల‌మ్మ ఆల‌యాన్ని అంగ‌రంగ వైభ‌వంగా అలంక‌రించారు. ఇక్క‌డ సంక్రాంతి రోజు నారా భువ‌నేశ్వ‌రి ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌నున్నారు. అన్న‌దానాలు, హ‌రిదాసు కీర్త‌న‌లు, భోగి మంట‌లు, ముగ్గులు, ఎద్దుల పందేలు.. ఇలా.. స‌ర్వం సంక్రాంతి శోభ‌తో నారా వారి ప‌ల్లె మురిసిపోనుంది.