పార్టీ పిరాయింపుల వ్యవహారం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వావాదానికి దారి తీసింది. ముగ్గురు మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లాకు చెందిన దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేల సమక్షంలోనే ఈ వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదానికి దిగిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరిని మరొకరు తోసుకున్నారు. పరస్పర దూషణలకు దిగారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య బూతుల పర్వం కూడా వినిపించింది. వెరసి సమావేశం రచ్చరచ్చగా మారింది.
కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం ఆదివారం జిల్లా కేంద్రం కరీంనగర్ లో ఏర్పాటైంది. ఈ సమావేశానికి జిల్లా ఇంచార్జీ మంత్రి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్ బాబు సహా జిల్లా ఎమ్మెల్యేలు, ఆయా శాఖల అధికార యంత్రాంగం హాజరైంది. జిల్లాలోని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలూ హాజరయ్యారు. 2023 ఎన్నికల్లో వీరిద్దరూ బీఆర్ఎస్ తరఫునే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత సంజయ్ కాంగ్రెస్ కు దగ్గరయ్యారు.
సమావేశంలో భాగంగా నియోజకవర్గ సమస్యలపై మాట్లాడాలన్న మంత్రుల సూచనతో సంజయ్ మైకు అందుకున్నారు. ఈ సమయంలో వేదిక కింద కూర్చున్న కౌశిక్ రెడ్డి ఉన్నట్టుండి..వేదిక మీదకు దూసుకెళ్లారు. ఏ పార్టీ ఎమ్మెల్యే హోదాలో మాట్లాడుతున్నావు అంటూ సంజయ్ ను నిలదీశారు. అడగడానికి నీవెవరు అంటూ కౌశిక్ రెడ్డిని సంజయ్ ఎదురు ప్రశ్నించారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం వాదించుకుంటూ… దూషించుకుంటూ… ఒకరినొకరు తోసుకున్నారు. మరికాసేపు ఉంటే… ఇద్దరూ పరస్పరం దాడులు చేసుకునేవారేమో.
అయితే సమావేశానికి హాజరైన ఇతర ఎమ్మెల్యేలు, అధికారులు వారిని విడదీశారు. సమావేశంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కౌశిక్ రెడ్డిని బలవంతంగా బయటకు తీసుకెళ్లిపోయారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ దయ వల్ల ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఇలాంటి పార్టీ ద్రోహులను క్షమించేది లేదని ఆయన హెచ్చరించారు.