తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి బోర్డుకు చాలా విశిష్ఠత ఉంది. ఎన్టీఆర్ హయాంలో తొలిసారి ఆరుగురు సభ్యులతో ఏర్పడిన బోర్డులో.. ప్రస్తుతం 52 మంది వరకు ఉన్నారు. ప్రతి నెల లేదా.. నిర్ణీత సమయాల్లో బోర్డు సభ్యులు సమావేశమై తిరు మలలో చేయాల్సిన పనులు, ఉన్నఖర్చులు.. ఆదాయ వ్యయాలు వంటివాటిపై నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా ఏటా నిర్వహించే కార్యక్రమాలపై ప్రణాళికలు రెడీ చేసుకుంటారు. ఈ బోర్డు సభ్యులు తీసుకున్న నిర్ణయాలను అధికారులు అమలు చేస్తారు.
తాజాగా టీటీడీ బోర్డు సమావేశం జరిగింది. చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో బోర్డు చరిత్రలో ఇప్పటి వరకు జరగని ఘటన ఒకటి జరగడం విశేషం.అదే.. ‘సంతాపం’. ఇప్పటి వరకు తిరుమలలో సంతాపం అన్న మాటే వినిపించలేదు. కానీ, తాజాగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుపతిలో ఇచ్చే టోకెన్ల కార్యక్రమంలో జరిగిన తొక్కిసలా టలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. ఈ ఘటన రాష్ట్రంలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. ఆవేదన మిగిల్చింది. ఈ నేపథ్యంలో మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ తిరుమల తిరుపతి పాలక మండలి సంతాపం తెలిపింది.
ఇలా జరగడం ఇదే తొలిసారి. అయితే.. ఇలా చేయడం ద్వారా మృతుల కుటుంబాలకు టీటీడీ భరోసా కల్పించడంతోపాటు.. వారికి అండగా ఉన్నామన్న సంకేతాలు ఇచ్చినట్టు అయిందని.. చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఇక, ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించడంతోపాటు.. పరిహారం అందించేందుకు నిర్ణయించారు. మృతుల కుటుంబ సభ్యుల చదువులకు అయ్యే ఖర్చును టీటీడీ భరిస్తుందని, టీటీడీ సభ్యులు స్వయంగా వెళ్లి నష్టపరిహారాన్ని అందిస్తారని నాయుడు పేర్కొన్నారు. కాగా, తొక్కిసలాట ఘటనపై జ్యూడీషియల్ విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటాన్నారు. చనిపోయిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం కల్పిస్తామన్నారు.