తెలుగులో మోదీ స్పీచ్ కు ఫిదా!

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు మోదీ. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమ మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు చెప్పే, అభిమానాన్ని చూపించే అవకాశం ఇప్పుడు లభించింది అంటూ మోదీ తెలుగులో ప్రసంగించగానే చంద్రబాబు, పవన్, లోకేశ్ సహా సభికులంతా చప్పట్లు కొట్టారు. తెలుగులో మోదీ మాటలు విని సభా ప్రాంగణమంతా కేకలు, చప్పట్లు, కేరింతలతో మార్మోగిపోయింది.

ఏపీ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తామని, చంద్రబాబు లక్ష్యాలకు అండగా ఉంటామని ప్రధాని మోదీ అన్నారు. ఏపీ అన్ని అవకాశాలున్న రాష్ట్రమని, ఏపీ ప్రజల ఆశీర్వాదంతో కేంద్రంలో, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. 60 ఏళ్ల తర్వాత వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చామని అన్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా ముందుకు పోతున్నామని, ఏపీతో చేయి కలిపి సాగుతామని తెలిపారు. 2030లోగా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకోసం నిర్దేశించిన రెండు హబ్ లలో ఒకటి విశాఖకు కేటాయించామని చెప్పారు.

చంద్రబాబు ప్రసంగాన్ని విన్నానని, ఆంధ్రప్రదేశ్ ప్రజల సేవే తమ సంకల్పం అని అన్నారు. ఐటీ, టెక్నాలజీకి ఏపీ సెంటర్ ఆఫ్ హబ్ కానుందని చెప్పారు. విశాఖలో దక్షిణ రైల్వే జోన్‌కు పునాది పడిందని, ప్రత్యేక రైల్వేజోన్‌ కల సాకారం కానుందని చెప్పారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర…ప్రత్యేక రైల్వే జోన్ వల్ల అభివృద్ధి చెందుతుందని, పర్యాటక రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయని మోదీ చెప్పారు. మత్స్యకారుల ఆదాయం పెరిగేలా చూస్తామని హామీనిచ్చారు. ఈ రోజు చేపట్టిన ప్రాజెక్ట్‌లు ఏపీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.