కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి సంపూర్ణ భరోసా ఇస్తూ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ బాధితులకు నగదు రహిత వైద్యం (క్యాష్ లెస్ ట్రీట్ మెంట్) ఇచ్చేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఈ పథకం అమలులోకి వస్తే… రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడంతో పాటుగా బాధితులకు మెరుగైన వైద్య సేవలూ అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ఓ కీలక ప్రకటన చేశారు. చండీగఢ్ లో గతేడాది మార్చి 14 నుంచి పైలట్ ప్రాజెక్టుగా అమలు అవుతున్న ఈ పథకాన్ని ఈ ఏడాది మార్చి నుంచి దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ పథకం కింద… దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రమాదం జరిగినా… ఆయా ప్రమాదాల్లో గాయపడ్డ బాధితులకు ఎలాంటి నగదు చెల్లించకుండానే… ఉచితంగా వైద్యం అందనుంది. ప్రమాదం జరిగిన తర్వాత ఏడు రోజుల పాటు ఆయా ప్రమాదాల్లో గాయపడ్డ ప్రతి ఒక్కరికి రూ.1.5 లక్షల మేర వైద్య సేవలు అందనున్నాయి. ఆయా ప్రమాదాల్లో ఎంతమంది గాయపడ్డా… వారందరికీ ఇదే నిబంధనల మేరకు కేంద్రం నగదు రహిత వైద్యాన్ని అందించనుంది. ఇందుకోసం కేంద్రం ఓ ఐటీ ఆధారిత వేదికను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. కేంద్ర ఉపరిత రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు కానున్న అధారిటీ… ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ పథకాన్ని అమలు చేయనుంది.
వాస్తవానికి రోడ్డు ప్రమాదాల్లో అక్కడికక్కడే మరణించే వారిని పక్కనపెడితే… గాయపడ్డ వారికి సత్వర చికిత్సలు అందితే… రోడ్డు ప్రమాద మరణాలు గణనీయంగా తగ్గుతాయని నివేదికలు చెబుతున్నాయి. దీనిపై ఇప్పటికే పూర్తి స్థాయిలో దృష్టి సారించిన కేంద్రం ఆయా జాతీయ రహదారుల వెంట ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అయినా కూడా బాధితుల్లో చాలా మందికి సత్వర వైద్యం చేయించుకునే స్తోమత లేకపోవడం పెను సమస్యగా పరిణమించింది. దీనిని అథిగమించేందుకే… కేంద్ర ప్రభుత్వం నగదు రహిత వైైద్యం అందించేందుకు సిద్ధమైంది. ఈ పథకం అమలులోకి వస్తే… రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడం ఖాయమేనన్న వాాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కేంద్రం తీసుకువస్తున్న ఈ పథకం రోడ్డు రవాణాలో ఓ బృహత్తర పరివర్తనకు దారి తీస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates