ఈ మాట‌లు జ‌గ‌న్‌కు చెప్పి ఉంటే బాగుండేది రామిరెడ్డీ!

“తెల్లారే స‌రికి పింఛ‌న్లు పంచ‌క‌పోతే ప్ర‌పంచం త‌ల‌కిందులు అవుతుందా? ఇది ఉద్యోగుల‌ను క్షోభ పెట్టిన‌ట్టు కాదా? మ‌హిళా ఉద్యోగులు ఇబ్బందులు ప‌డుతున్నారు. వారిని క‌నీసం ప‌ట్టించుకోకుండా.. ఉద‌యం 5 గంట‌ల‌కే ఇళ్ల‌కు తోలుతున్నారు. ఇదేం ప‌ద్ధ‌తి“- ఇదీ.. వైసీపీ సానుభూతి ప‌రుడుగా పేరొందిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు కాక‌ర్ల వెంక‌ట్రామిరెడ్డి… (రామిరెడ్డి) చేసిన వ్యాఖ్య‌లు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌లు నిప్పులు చెరుగుతున్నారు.

ఉద్యోగులు ఉన్న‌ది ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకేన‌ని.. స‌మ‌యంతో నిమిత్తం లేద‌ని అంటున్నారు. ఒక‌వేళ స‌మ‌యం ప్ర‌కారం ప‌నిచేయాల‌ని అనుకున్నా.. పింఛ‌న్ల పంపిణీ రోజు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కే ప‌నిచేసుకుని ఇళ్ల‌కు వెళ్లిపోతున్నారు క‌దా? అని చెబుతున్నారు. నీతులు చెప్పాల‌ని అనుకుంటే అప్ప‌ట్లో తెల్ల‌వారు జామున 5గంట‌ల‌కు వాలంటీర్ల‌ను, స‌చివాల‌య ఉద్యోగుల‌ను ఇళ్ల‌కు పంపించిన జ‌గ‌న్‌కు ఎందుకు చెప్ప‌లేద‌ని నిల‌దీస్తున్నారు.

ప్ర‌స్తుతం పింఛ‌న్ల పంపిణీ స‌క్ర‌మంగా స‌మ‌యానికి జ‌రిగిపోతోంద‌ని.. ఇది త‌ట్టుకోలేని వైసీపీ నేత‌లు.. రామిరెడ్డిని ముందు పెట్టి విమ‌ర్శ‌లు చేయిస్తున్నార‌ని విజ‌య‌వాడ‌కు చెందిన టీడీపీ నాయ‌కుడు ఒక‌రు విమ‌ర్శించారు. చంద్ర‌బాబు కూడా.. ఉద‌యాన్నే బ‌య‌లు దేరి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తున్న విష‌యాన్ని, పింఛ‌న్లు పంచుతున్న విష‌యాన్ని వారు ప్ర‌స్తావిస్తున్నారు. కాబ‌ట్టి.. రామిరెడ్డి వాస్త‌వాలు తెలుసుకుని మాట్లాడాల‌ని లేక‌పోతే… తగిన చర్యలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

కాగా.. వైసీపీ హ‌యాంలోనూ ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించిన రామిరెడ్డి.. టీడీపీ నేత‌ల‌తో చీవాట్లు తిన్నారు. ఇటీవ‌ల ఆయ‌న‌పై కేసు కూడా న‌మోదైంది. అనుమ‌తి లేకుండా.. మందు పార్టీ ఇచ్చార‌న్న అభియోగాల‌పై ఆయ‌న‌పై కేసు పెట్టారు. ఇప్పుడు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ.. స‌ర్కారుపై దుమ్మెత్తి పోసే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టార‌ని.. ఉద్యోగుల్లోని మ‌రో సంఘం నాయ‌కులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.