ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. అయితే, తన లాయర్ ను పోలీసులు, ఏసీబీ అధికారులు అనుమతించకపోవడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దాదాపు 40 నిమిషాల పాటు పోలీసులు, అధికారులకు..కేటీఆర్, ఆయన లాయర్లకు మధ్య వాగ్వాదం జరిగింది.
లాయర్ ను అనుమతించాలని కోర్టు ఉత్తర్వుల్లో లేదని పోలీసులు.. లాయర్‌ను అనుమతించకూడదన్న నిబంధన ఎక్కడ ఉందో చూపాలని కేటీఆర్ వాదనకు దిగారు. చాలా సేపు ఏసీబీ అధికారుల స్పందన కోసం వేచి చూసిన కేటీఆర్ వారు స్పందించకపోవడంతో విచారణకు హాజరు కాకుండానే వెనుదిరిగారు.
తనకు నోటీసులిచ్చిన ఏసీబీ అడిషనల్ ఎస్పీకి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దానిని ఎక్ నాలెడ్జ్ చేసినట్లు రిప్లై ఇచ్చారు ఏసీబీ అధికారులు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులపై, పోలీసులపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను పోలీసులను నమ్మనని, లాయర్లు ఉంటేనే తనకు రక్షణ అని అన్నారు. సినిమా దర్శకుల కంటే ఏసీబీ అధికారులు మంచి కథలు చెబుతున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పట్నం నరేందర్ రెడ్డి చెప్పని స్టేట్ మెంట్ చెప్పినట్లు పోలీసులు రాసుకున్నారని ఆరోపించారు.
తనకు కూడా అలా జరుగుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. తన ఇంట్లో ఏసీబీ దాడులు చేసి ఏదైనా పెట్టి కుట్ర పన్ని తనను ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. రేపు ఇదే కేసులో ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.