క‌మ్మ వారిని జ‌గ‌న్‌ వేధించారు: మాజీ ఐపీఎస్ ఫైర్‌

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌పై ఐపీఎస్ మాజీ అధికారి.. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో పూర్తిగా స‌స్పెన్షన్‌కు గురైన ఆలూరి బాల వెంక‌టేశ్వ‌ర‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌మ్మ వారిపై గ‌త ప్ర‌భుత్వం బ‌హిరంగ యుద్ధం చేసింద‌న్నారు. అయినా.. కొందరు త‌ట్టుకుని నిల‌బ‌డితే.. మ‌రికొంద‌రు.. క‌నుమ‌రుగ‌య్యార‌ని చెప్పారు.

క‌మ్మ స‌మాజం త‌న అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు పోరాడాల్సిన దుస్థితి వ‌చ్చింద‌ని చెప్పారు. ఇక‌, ముందు ఇలాంటి పోరాటాల‌కు అవ‌కాశం లేకుండా.. క‌మ్మ స‌మాజం జాగృతం కావాల‌ని, క‌మ్మ వారిని వేధించే శ‌క్తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు క‌ట్ట‌డి చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గంగూరులో తాజాగా ఆదివారం నిర్వ‌హించిన ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌ల్లో ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వైసీపీ హ‌యాంలో క‌మ్మ సామాజిక వ‌ర్గంపై జ‌రిగిన దాడుల‌ను ఒక్కొక్క‌టిగా వివ‌రించారు. అమ‌రావ‌తి రాజ‌ధాని ప్ర‌పంచానికే త‌ల‌మానికంగా ఉండాల‌ని సీఎం చంద్ర‌బాబు గ‌తంలోనే త‌ల‌పోశార‌ని.. ఇది ప్ర‌పంచ న‌గ‌రంగా అభివృద్ధి చెందితే. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఇది అందివ‌స్తుంద‌ని అన్నారు. అయితే.. అలాంటి న‌గ‌రంపైనా క‌మ్మ ముద్ర వేసిన ఘ‌న‌త కొంద‌రు నాయ‌కుల‌కు చెల్లుతుంద‌ని ప‌రోక్షంగా జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగారు. “ఏం పావుకున్నారు..? ఏదో చేయాల‌ని అనుకున్నారు. కానీ, ఏమీ చేయ‌లేక‌పోయారు. వీరంతా కుక్క‌మూతి పిందెలు!” అని వ్యాఖ్యానించారు.

ఇక‌, క‌మ్మ సామాజిక వ‌ర్గంలో అస్ప‌ష్ట‌త గోచ‌రిస్తోంద‌ని ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు వ్యాఖ్యానించారు. ఎవ‌రో వ‌చ్చి నిర్దేశం చేసే వ‌ర‌కు కూడా.. వారు మేల్కోవ‌డం లేద‌న్నారు. గ‌త ఐదేళ్ల‌లో ఎన్న‌డూ లేని విధంగా క‌మ్మ వ‌ర్గంపై దాడులు జ‌రిగాయ‌ని చెప్పారు.

అయితే.. వాటిని బ‌లంగా ఎదుర్కొని నిల‌బ‌డ‌గ‌ల‌గ‌డంలోనే క‌మ్మ వారి శ‌క్తి గోచ‌రిస్తోంద‌న్నారు. రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన వారి ప‌ట్ల ఎంతో గౌర‌వంగా వ్య‌వ‌హ‌రించాల‌ని.. కానీ, ఈ విష‌యంలోనూ కొంద‌రు అత్యంత హీనంగా ప్ర‌వ‌ర్తించి అప‌ప్ర‌ద మూట‌గ‌ట్టుకున్నార‌ని చెప్పారు. వారికి క‌మ్మ‌ల‌పై కోపం కాదు.. క‌మ్మ‌వారు ఎదుగుతుంటే కోపం. ఆధిప‌త్య అహంకారం అని ఏబీవీ వ్యాఖ్యానించారు. వీటి నుంచి బ‌య‌ట ప‌డేందుకు క‌మ్మ సామాజిక వ‌ర్గం ఏక‌తాటిపైకి రావాల‌ని సూచించారు.