తెలంగాణలో బాగా వర్షాలు పడే నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉంటుంది. ఈ సిటీలో ఏటా భారీ వర్షాలే పడుతుంటాయి. తెలంగాణలో వర్షాలు పడ్డాయంటే హైదరాబాద్లో కచ్చితంగా సగటు వర్షపాతం కంటే ఎక్కువే నమోదవుతుంది. ఈసారి వర్షాలు మరీ భారీగా పడుతున్నాయి. ఇప్పటికే రెండు మూడు సందర్భాల్లో కొన్ని రోజుల పాటు వదలకుండా వర్షాలు కమ్ముకున్నాయి.
మొదటి రోజు వర్షాల్ని బాగా ఆస్వాదించిన వాళ్లు.. రెండు మూడు రోజుల తర్వాత విసుగెత్తిపోయే రీతిలో వర్షం వదలట్లేదు. అందులోనూ తాజాగా గత ఐదారు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చిన వరుణుడు సోమవారం సాయంత్రం మొదలుపెట్టి ఆపకుండా తన జోరు చూపిస్తున్నాడు. 24 గంటలకు పైగా విరామం లేకుండా వర్షం కురుస్తుండటం గమనార్హం.
ఈ దెబ్బకు హైదరాబాద్ నగరం పరిస్థితి ఘోరంగా తయారైంది. నగరంలో చాలా ఏరియాలు నదులు, చెరువులను తలపిస్తున్నాయి. పెద్ద పెద్ద సెంటర్లు పూర్తిగా జలమయం అయ్యాయి. ఇళ్లు మునిగిపోయాయి. వాహనాలు నీళ్లలో కొట్టుకుపోతున్నాయి. వివిధ ప్రాంతాలకు సంబంధించి వర్ష భీభత్సానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు భయం గొల్పుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బయట తిరగడం అత్యంత ప్రమాదం అని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముసురు మరికొన్ని రోజులు కొనసాగుతుందని అంటున్నారు. ఒక రోజుకు పైగా ఆగని వర్షం వల్ల ఇళ్లు, రోడ్లు నానడం వల్ల నాణ్యతలో ఏమాత్రం తేడా ఉన్నప్పటికీ కూలిపోయే ప్రమాదాలున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
కాగా హైదరాబాద్లో 150 ఏళ్లలో అత్యధిక వర్షపాతం నమోదైన సంవత్సరంగా 2020 రికార్డు సృష్టించడానికి అత్యంత చేరువలో ఉన్నట్లుగా ఓ వాతావరణ నిపుణుడు ట్విట్టర్లో మెసేజ్ పోస్ట్ చేశారు.