జేసీ నోట `క్ష‌మా` మాట‌.. స‌ర్దుకున్న‌ట్టేనా?

ఏపీలో కూటమిగా ఉన్న టీడీపీ-బీజేపీ మ‌ధ్య స‌ఖ్య‌త బాగానే ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో కొన్ని కొన్ని నియోజ‌క వ‌ర్గాల్లో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు మాత్రం కూట‌మికి కుంప‌టి పెట్టేలా నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీనిలో ప్ర‌ధానంగా అనంత‌పురం జిల్లాకు చెందిన తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీనాయ‌కుడు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఒక‌రు. తాజాగా ఆయ‌న బీజేపీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు. మ‌హిళా నాయ‌కుల విమ‌ర్శ‌ల‌పై ప్ర‌తి విమ‌ర్శ‌లు చేశారు.

దీనిపై తీవ్ర ర‌గ‌డ చోటు చేసుకుంది. బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ సైతం స్పందించారు. దీంతో విష‌యం సీరియ‌స్ అవుతున్న‌ట్టు గ్ర‌హించిన జేసీ.. నాలుగు మెట్లు దిగి వ‌చ్చారు. తొలిసారి ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు కోరుతూ.. బీజేపీ నాయ‌కురాలు, న‌టి మాధ‌వీల‌త‌కు విన్న‌వించారు. “తొంద‌ర‌ప‌డ్డాను, ఆవేశంలో ఏదో అన్నాను. ఇది స‌రికాదు. సారీ“ అంటూ.. ముక్తాయించారు. దీంతో వివాదం దాదాపు స‌ర్దు మ‌ణిగింద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఆదివారం మీడియాతో మాట్లాడిన జేసీ.. “నేను మాధవిలత మీద టంగ్ స్లిప్ అయ్యాను. అందుకు క్షమాపణలు చెబుతున్నా“ అని వ్యాఖ్యానించారు. తాడిపత్రి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోస‌మే తాను త‌ప‌న ప‌డుతున్న‌ట్టు వెల్ల‌డించారు. తాడిపత్రి ప్రజలే త‌న‌కు సైన్యమ‌ని వివ‌రించారు. నియోజ‌క‌వ‌ర్గం కోసం తాను పోరాడుతున్నాన‌ని.. అంత‌కు మించి వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు ఎవ‌రిపైనా ఎలాంటి దురుద్దేశం లేద‌ని తెలిపారు.

ఇక‌, తాను పార్టీ మారుతున్న‌ట్టు వస్తున్న వ్యాఖ్య‌ల‌పైనా జేసీ స్పందించారు. తాను ఎట్టి ప‌రిస్థితిలోనూ పార్టీ మారేది లేద‌న్నారు. చంద్రబాబు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మ‌రీ విజ‌యం సాధించార‌ని, ఆయ‌న వెంటే తాను న‌డుస్తాన‌ని తెలిపారు. చంద్ర‌బాబు రాష్ట్రం కోసం క‌ష్ట‌ప‌డుతున్నార‌ని.. తాను తాడిప‌త్రి కోసం క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని వ్యాఖ్యానించారు. దీనిలో వేరే నాయ‌కుల ప్ర‌మేయం వ‌ద్ద‌ని ఆయ‌న ప‌రోక్షంగా సూచించారు.