2025 చంద్ర‌బాబు తొలి సంత‌కం.. దేనిపై చేశారంటే!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. 2025 నూత‌న సంవ‌త్స‌రం తొలిరోజు చాలా చాలా బిజీగా గ‌డిపారు. అయితే.. స‌హ‌జంగానే తొలి సంవ‌త్స రం ప్రారంభం రోజున అభినందించేందుకు వ‌చ్చేవారు.. పుష్ప‌గుచ్చాలు తెచ్చేవారితో చంద్ర‌బాబు బిజీగా గ‌డ‌ప‌లేదు. అస‌లు ఎవ‌రినీ రావొద్ద‌ని కూడా ఆయ‌న ఆదేశించిన‌ట్టు తెలిసింది.

దీంతో ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలోఈ రోజు ఒక్క పుష్ప గుచ్ఛం కూడా క‌నిపించ‌లేదు. విషెస్ చెప్పేవారు కూడా.. ఎవ‌రూ రాలేదు. ఉద‌యం 10 గంట‌ల‌కే ఆఫీసుకువ‌చ్చిన చంద్ర‌బాబు.. సాయంత్రం వ‌ర‌కు ఉన్న‌తాధికారుల‌ను పిలిపించుకుని స‌మీక్ష‌లు నిర్వ‌హించారు.

వారికి ఈ నూత‌న సంవ‌త్స‌రంలో చేయాల్సిన ప‌నుల‌పై దిశానిర్దేశం చేశారు. వ‌చ్చే ఏడాది అనేక కార్య‌క్ర‌మాలు పెట్టుకున్న నేప‌థ్యంలో వాటిని ఆయ‌న స‌మీక్షించారు. ప్ర‌తి విష‌యంపై నిశితంగా దిశానిర్దేశం చేశారు. శాఖ‌ల వారీగా అధికారుల‌ను మాత్ర‌మే పిలిపించుకున్న ముఖ్య‌మంత్రి సుమారు 8 శాఖ‌ల‌పై స‌మీక్ష‌లు నిర్వ‌హించారు.

అదేవిధంగా కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టుపై ఎక్కువ సేపు స‌మీక్షించారు. ప్ర‌తి విష‌యాన్నీ ఆయ‌న అడిగి తెలుసుకున్నారు. కొన్నింటిని స్వ‌యంగా ప్ర‌స్తావించా రు. ప్ర‌స్తుతం డ‌యాఫ్రం వాల్ నిలిచిపోయిన నేప‌థ్యంలో ఆ ప‌నులు త్వ‌రిత గ‌తిన ప్రారంభించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఇదిలావుంటే.. 2025, తొలి రోజు బుధ‌వారం తొలి సంత‌కానికి సీఎం చంద్ర‌బాబు ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ద‌ర‌ఖాస్తులు చేసుకున్న‌వారి వివ‌రాలు తెప్పించుకుని సుమారు 120 ద‌ర‌ఖాస్తుల‌పై ఆయ‌న సంత‌కాలు చేశారు. మొత్తం 24 కోట్ల రూపాయ‌ల సాయానికి సంబంధించిన ద‌ర‌ఖాస్తుల‌పై ముఖ్య‌మంత్రి సంత‌కాలు చేశారు.

వీటిలో కిడ్నీ ఆప‌రేష‌న్లు, గుండె ఆప‌రేష‌న్లు, చిన్నారులకు సంబంధించిన స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ముఖ్య‌మంత్రి కార్యాల‌యం తెలిపింది. ఏదేమైనా తొలిరోజు కేవ‌లం శుభాకాంక్ష‌లు.. పుష్ప గుచ్ఛాల‌కు మాత్ర‌మే స‌మ‌యం కేటాయించ‌కుండా.. సాయానికి , అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.