నూతన సంవత్సరం-2025 వచ్చేసింది. ఎన్నో ఆశలు.. ఎన్నెన్నో ఆశయాలతో కొంగొత్త సంవత్సరం ఆవిష్కృతమైంది. ఏ సంవత్సరానికైనా 365 రోజులు ఉన్నట్టుగానే.. 2025లోనూ అన్నేరోజులు ఉంటాయి. కానీ, ఏపీ విషయానికి వస్తే.. ఈ రోజులు అన్నీ చాలా డిఫరెంట్. ఏ రోజూ.. మునుపటి సంవత్సరపు రోజుల మాదిరిగా ఉండే అవకాశమే లేదు.
దీనికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు! ప్రతిరోజూ పండగే
అన్న తరహాలో ఏపీని వడివడిగా అడుగులు వేయించేలా చంద్రబాబు 2025 డైరీలో ప్రతి రోజునూ పక్కా ప్రణాళికతో తీర్చిదిద్దుకున్నారు. ఏ పనులు ఎప్పుడు ప్రారంభించాలో.. ఏయే పనులకు శ్రీకారం చుట్టి పూర్తి చేయాలో ఆయన నిర్దేశించుకున్నారు.
దీంతో చంద్రబాబు 2025 డైరీలో ప్రతిపేజీ పక్కా ప్రణాళికతో నిండిపోయింది. రాజధాని అమరావతి నుంచి పోలవరం ప్రాజెక్టు పనుల వరకు.. అనేక కార్యక్రమాలు ఈ డైరీలో నిక్షిప్తమయ్యాయి. పక్కా ప్రణాళిక, ముందు చూపు, నిధుల సేకరణ.. వంటివాటికి బహుముఖ రీతుల్లో ప్రణాళికలు వేసుకున్నారు.
పక్కాగా అమలు చేసేలా యంత్రాంగానికి కూడా దిశానిర్దేశం చేసుకున్నారు. ఒక్క ఈ పనులు మాత్రమే కాదు.. అధికారుల్లో చైతన్యం కలిగించడం నుంచి జిల్లాలపర్యటన దాకా.. అన్నీ నిర్దేశించుకున్నారు. నవ్యాంధ్రలో రెండో సారి పాలనా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు.. గతానికి భిన్నంగా ఆరు మాసాల పాటు.. పాలనపై పట్టు సాధించేందుకే ప్రయత్నించారు.
ఈ క్రతువు పూర్తయింది. ఆయనే చెప్పినట్టు.. ఆర్థిక వ్యవస్థ నుంచి అన్ని వ్యవస్థలనూ పట్టాలెక్కించారు. ఒకటి రెండు మినహా మిగిలిన వ్యవస్థలు పక్కాగా పట్టాలెక్కాయి. ఎక్కడ ఏం జరిగినా.. తెలిసేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసుకున్నారు. దీనిలో కీలకమైన డ్యాష్ బోర్డును జనవరి నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
అదే విధంగా మంత్రులపైనా ప్రతి రోజూ.. పర్యవేక్షణకు వారి హాజరు తీసుకుంటారు. కేవలం ఆఫీసులకే పరిమితం కాకుండా.. సమీక్షలకే సమయాన్ని కేటాయించకుండా.. ప్రజల మధ్య ఉండేందుకు ఎక్కువ సమయాన్ని కేటాయించుకున్నారు. పాలనా పరమైన అన్ని వ్యవహారాలను ప్రజలతో పంచుకునే వ్యవస్థను మరింత పటిష్ఠం చేశారు. ఇలా.. 2025 చంద్రబాబు డైరీ.. వినూత్న వైవిధ్య పాలనా పనులతో నిండిపోయింది.