పేర్ని నాని రాజీ ఫార్ములా దిశగా అడుగులు వేస్తున్నారా? ఆయన కుటుంబంపై నమోదైన రేషన్ బియ్యం కేసుల విషయంలో పీకల దాకా కూరుకుపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఏదో ఒక రకంగా ఆయా కేసుల నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటే.. మచిలీపట్నం రాజకీయాలు ఔననే అంటున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి, బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడు ఈ విషయంలో రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారన్నది పొలిటికల్గా వినిపిస్తున్న మాట.
ఈ క్రమంలోనే అనూహ్యంగా అనంతపురానికి చెందిన జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పందించారని కూడా అంటున్నారు. అంటే.. రాజీ కుదిరితే.. పేర్ని కుటుంబంపై కేసులు సహజంగానే డైల్యూట్ అవుతాయి. దీనికి తాజా ఉదాహరణ.. స్థానిక కోర్టులో పేర్ని జయసుధకు బెయిల్ దక్కడమేనని అంటున్నారు.
తెరవెనుక ఏదో జరుగుతోందని.. రాజీ ఫార్ములా బాగానే వర్కవుట్ అవుతోందని అంటున్నారు. సహజంగా నే చంద్రబాబు కూడా.. తన ప్రత్యర్థులను నేరుగా శిక్షించరు. తెగే దాకా ఏవిషయాన్నీ లాగరు. వారిని ఏదో ఒకరకంగా నోరు మెదపకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతారు.
ఇప్పుడు వైసీపీ తరఫున నోరు ఎత్తుతున్న పేర్ని విషయంలోనూ ఇదే జరుగుతోందని అంటున్నారు. ఆయన ఎలానూ ఫైన్ చెల్లించారు కాబట్టి.. ఇక, తెగే దాకా లాగితే.. అనవసరంగా పేర్నిని పెద్దోడిని చేసినట్టే అవుతుందన్నది పార్టీ వర్గాల మాటగా ఉంది.
ఈ నేపథ్యంలో ఈ కేసును రాజీ దిశగా ముందుకు తీసుకువెళ్లి.. పేర్నినోటికి తాళాలు వేయడం ద్వారా వైసీపీని డైల్యూట్ చేయాలన్న వ్యూహం అయితే ఉందని చెబుతున్నారు. దీనికి ఉత్తరాంధ్రకు చెందిన కీలక నాయకుడు జోక్యం చేసుకోవడం.. రాజీ ఫార్ములా వడివడిగా ముందుకు సాగుతుండడం గమనార్హం.
అందుకే.. పేర్ని కూడా కొంత మేరకు వెనక్కి తగ్గి.. చంద్రబాబుపై ప్రశంసలు కురిపించడం మహిళలను అరెస్టు చేయొద్దని చంద్రబాబు చెప్పారని వ్యాఖ్యానించడం వంటివి చోటు చేసుకున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి.