2025 కొత్త సంవత్సరం కీలక నిర్ణయాలకు వేదిక అవుతోంది. ప్రధానంగా రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ సంవత్సరంలోనే జరగనున్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రతిపాదించిన కీలకమైన జమిలి ఎన్నికల బిల్లు కూడా.. ఈ ఏడాదే తేలిపోనుంది. అయితే.. అటు, లేకపోతే.. ఇటు అన్నట్టుగా ఈ సంవత్సరం దీనిపై పార్లమెంటు ఉభయ సభలు నిర్ణయం తెలుపనున్నాయి. అదేవిధంగా రాస్ట్రాల అసెంబ్లీలు కూడా.. ఈ జమిలిపై తీర్మానం చేయనున్నాయి. అలాగే.. ప్రజలపై పన్నుల భారాలు కూడా ఈ ఏడాదే పెరగనున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ధరల పెరుగుదల, వడ్డీల బాదుడుకు కూడా ఈ ఏడాది ప్రతి కుటుంబాలు రెడీ కావాల్సిందేనని అంటున్నారు.
ఎన్నికలు..
కీలకమైన దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో 2025, ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను బీజేపీ కీలకంగా తీసుకుంది. ఇప్పటికి రెండు సార్లు ఓడిపోయిన బీజేపీ ఈ దఫా విజయం కోసం అర్రులు చాస్తోంది. రెండు సార్లుగా ఇక్కడ పాలన సాగిస్తున్న కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడం ద్వారా.. కమల నాథులు ఇక్కడ పాగా వేయాలని కోరుకుం టున్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ స్వంతంగానే బరిలోకి దిగుతోంది. దీంతో ఈ ఎన్నికలు మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ పెంచేసింది. మరోవైపు.. అక్రమాలు.. అన్యాయాలు, లంచాలు, లిక్కర్ వ్యవహారం.. సహా పలు ఉచిత హామీలు.. జైళ్ల సంగతులు.. కూడా ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మారనున్నాయి.
మరో కీలక రాష్ట్రం బీహార్. ఇక్కడ 2025 ద్వితీయార్థంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, బీజేపీలు కలిసి ఎన్నికలకు వెళ్లే అంశం తర్జన భర్జనగా మారింది. ముఖ్యమంత్రి పీఠంపై గురి పెట్టిన బీజేపీ.. వ్యవహారం.. నితీష్‌కు కంట్లో నలుసుగా మారింది. దీంతో ఏ క్షణమైనా ఆయన ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అంచనావేస్తున్నారు. దీంతో కమల నాథులకు సీఎం పీఠంపై ఆశలు ఉన్నా.. ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. వెరసి బీహార్ రాజకీయం 2025లో ఎటువైపు మలుపు తిరుగుతుందనేది ఆసక్తిగా మారింది.
ఆర్థిక బాదుళ్లు!
ఇక, 2025లో అన్ని ధరలు పెరగనున్నాయని ప్రముఖ వాణిజ్య సంస్థల సర్వే.. సంస్థ ఆసోచాం
పేర్కొంది. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుండడం.. జీఎస్డీపీ తగ్గుముఖం పట్టడం, ద్రవ్యలోటు భయ పెడుతున్న కారణంగా.. నిత్యావసరాల నుంచి బంగారం వరకు అన్ని ధరలూ ఆకాశానికి అంటే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. మదుపరులు ఆయా విషయాలపై కడు జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగాలన్నది ఆశోచాం ప్రధాన సూచన.
ఇక, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. గత నాలుగు దఫాలుగా పరపతి విధానాల్లో పెద్దగా మార్పులు తీసుకురాలేదు. దీంతో వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్నాయి. కానీ, ద్రవ్యోల్బణం పెరుగుతున్న దరిమిలా.. కొత్తగా వచ్చిన ఆర్బీఐ గవర్నర్.. వడ్డీ రేట్లకు రెక్కలు తొడిగే అవకాశం ఉందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. ఇదేజరిగితే.. గృహ, వాహన, వ్యక్తిగత(పర్సనల్) రుణాలపై వడ్డీలు పెరిగిపోతాయి. సో.. 2025.. కీలక నిర్ణయాలకు వేదికగా మారనుందని చెబుతున్నారు నిపుణులు.