పేర్నినానిపై కేసు.. ప‌రారీలో నేత‌?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. రేష‌న్ బియ్యం అక్ర‌మాల‌కు సంబంధించి ఉమ్మ‌డి కృష్నాజిల్లా మ‌చిలీప‌ట్నం పోలీసులు నానిపై తాజాగా కేసు న‌మోదు చేశారు. ఇప్ప‌టికే ఈ వ్య‌వ‌హారంపై నాని స‌తీమ‌ణి జ‌య‌సుధ‌పై కేసులు పెట్ట‌డం తెలిసిందే. దీంతో ఆమె స్థానిక కోర్టును ఆశ్ర‌యించి బెయిల్ తెచ్చుకున్నారు. ఆ మ‌ర్నాడే.. నానిపై కేసు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఈ కేసులో నానిని A-6గా పోలీసులు పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

పేర్ని నాని స‌తీమ‌ణి జ‌య‌సుధ పేరిట ఆయ‌న మంత్రిగా ఉన్న స‌మయంలో గోదాములు నిర్మించారు. వీటిని ప్ర‌భుత్వానికే అద్దెకు ఇచ్చారు. ఈ గోదాముల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను మాత్రం జ‌య‌సుధ చూసుకుం టున్నారు. అద్దెల కింద‌ట ఏటా 6-8 కోట్ల రూపాయ‌లు తీసుకుంటున్న‌ట్టు అధికారులు తెలిపారు. అయితే.. ఇటీవ‌ల ఈ గోదాముల్లో పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అధికారులు రేష‌న్ బియ్యాన్ని నిల్వ చేశారు. ఈ బియ్యాన్ని ఇటీవ‌ల లెక్క చూడ‌గా.. 1300 ట‌న్నుల బియ్యం మాయ‌మైంది.

దీనిపై వెంట‌నే స్పందించిన గోదాముల య‌జ‌మాని జ‌య‌సుధ‌.. ప్ర‌భుత్వానికి రూ.1.6 కోట్ల మేర‌కు న‌ష్ట ప‌రిహారం చెల్లించారు. అయితే.. అస‌లు ఈ గోదాముల నుంచి బియ్యం ఎవ‌రి ప్ర‌మేయంతో బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌ని అధికారులు ఆరా తీశారు. దీంతో మేనేజ‌ర్ స‌హా కొంద‌రు తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ ఉద్యోగుల‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. ఈ క్ర‌మంలో వారి వేళ్లు పేర్ని నాని వైపే చూపించాయి. అంటే.. ఆయ‌న ఆదేశాల మేర‌కుఅధికారుల అనుమ‌తి లేకున్నా.. బియ్యాన్ని గిడ్డంగుల నుంచి త‌ర‌లించిన‌ట్టు స్ప‌ష్ట‌మైంది.

దీంతో తాజాగా పోలీసులు పేర్నిపై కేసు న‌మోదు చేశారు. ఇదిలావుంటే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు మీడియా ముందు వ‌చ్చిన పేర్ని నాని మంగ‌ళ‌వారం ఉద‌యం త‌న‌పై కేసు న‌మోదైన విష‌యం వెలుగు చూడ‌క ముందే.. దీనిపై ఉప్పంద‌డంతో వేరే ప్రాంతానికి వెళ్లిపోయిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఆయ‌న కోసం పోలీసులు గాలిస్తున్నారు.