అది 2023, సెప్టెంబరు 2వ తేదీ. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి. ఊరూవాడా ఘనంగా నిర్వహించాలని అప్పటి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని ఆయన నివాసంలో కూడా అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, నేతలను ఉద్దేశించి జగన్ ప్రసంగిస్తూ.. “2024లో మనకు తిరుగుండదు.. మళ్లీ మనదే అధికారం” అని గట్టిగానే చెప్పారు. ప్రతి ఇల్లూ తిరగాలని.. జగనే మన నమ్మకం అనే ప్రచారం జోరుగా సాగించాలని పిలుపునిచ్చారు.
కట్ చేస్తే.. 2024 వచ్చింది. సార్వత్రిక ఎన్నికల సమరం పూర్తయింది. మరోసారి అధికారం.. వైనాట్ 175 అన్న జగన్ పార్టీ.. 11కు పరిమితమైంది. ఇది భారీ దెబ్బ. పైకి కనిపించని విధంగా వైసీపీని ప్రజలు చావు దెబ్బ కొట్టారు. ఆ తర్వాత.. పార్టీ పరంగా నాయకుల జంపింగులు చోటు చేసుకున్నాయి. ఇవి మరింతగా జగన్‌కు ఇబ్బంది పెట్టాయి. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం ఆయన చేసిన న్యాయ పోరాటం తేలలేదు. సభకు డుమ్మా కొట్టడం.. సభ్యులను కూడా వెళ్లకుండా చేయడంతో మేధావుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్నారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే.. సోదరి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల రూపంలో వచ్చిన రాజకీయ ఎదురు దాడిని నిలువరించలేక పోవడం మరో ప్రధాన ఇబ్బందిగా మారింది. ఆస్తుల వివాదాలు.. కోర్టుకు వెళ్లడం.. తల్లి, చెల్లిపైనే న్యాయ పోరాటాలు వంటివి కూడా ఈ ఏడాది జగన్ హిస్టరీలో మరకలుగా మారాయి. తాను నమ్ముకున్నవారితోపాటు.. తనను నమ్మిన వారు కూడా.. పార్టీ మారిపోయారు. వీరిలో మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల నాని కీలక పాత్రలు. వీరికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చానని జగనే చెప్పుకొన్నారు. అయినా.. వారు పార్టీ వదిలేసి వెళ్లిపోయారు.
ఇక, కేంద్రంతో సంబంధాల విషయంలోనూ దోబూచులు కనిపించాయి. ఎవరితో చెలిమి చేయాలన్న విషయం కూడా ఈ ఏడాది వైసీపీకి అగ్ని పరీక్షగా మారిపోయింది. ఇండియా కూటమితోనా.. ఎన్డీయే కూటమితోనా.. అన్నది కూడా జగన్‌కు ఇబ్బంది పెట్టింది. అదేవిధంగా కాకినాడ పోర్టు వ్యవహారంలో కీలక నాయకులు కేసులు ఎదుర్కొనక తప్పలేదు. విద్యుత్ చార్జీలను పెంచారన్న ఆరోపణలతో చేపట్టిన నిరసనలు కూడా పెద్దగా ఫలితం ఇవ్వలేదు. ఇక, ఇంచార్జ్‌ల వైఖరిపై సొంత పార్టీలో కుమ్ములాటలు కూడా ఇరుకున పెట్టాయి. వెరసి.. ఎలా చూసుకున్నా.. 2024 జగన్‌కు కౌకు దెబ్బలే మిగిల్చిందని చెప్పక తప్పదు.